అధికోత్పత్తి కోసం ఎరువులు, పురుగు మందుల వాడకం తీవ్రమైన నేటి రోజుల్లో సహజ సిద్ధంగా పండే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు లభించడమే గగనమైపోయింది. క్రిమి సంహాకర మందుల అవశేషాలు.. ఆహారంలో నిల్వ ఉండటం వల్ల వాటి ప్రభావం ఆరోగ్యంపై పడుతోంది. ఈ నేపథ్యంలో తమకు కావాల్సిన కూరగాయలు, ఆకుకూరల్ని తామే పండించుకోలేమా అని ఆలోచించారు మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన గవిని లత దంపతులు.
200 గజాల్లోనే అంతా..
సుమారు 200 చదరపు గజాల్లో ఇంటిపై కప్పుపై ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు పండించాలని భావించారు గవిని లత. అనుకున్నదే తడవుగా సుమారు లక్షన్నర రూపాయలు వెచ్చించి మిద్దె మీద పెరటి తోటకు ఏర్పాట్లు చేశారు. స్లాబ్‌కు ఆనకుండా అడుగు ఎత్తులో సిమెంట్‌తో పెద్ద పెద్ద తొట్టెలను నిర్మించారు. కప్పుపై భారం పడకుండా పిల్లర్, పిల్లర్‌కు మధ్య భీంలపైనే ఈ తొట్టెలను నిర్మించారు. తొట్టెల్లో కంకర, ఎర్రమన్ను, పశువుల ఎరువు కలిపిన మిశ్రమాన్ని నింపారు. ఆ మట్టిలోనే విత్తనాలు వేసి మొక్కలను పెంచారు. మొక్కలకు పట్టే నీరు ఎప్పటికప్పుడు కిందకు ఇంకేలా, ఇంకిన నీరు నేరుగా.. ఇంకుడు గుంతలో చేరేలా ఏర్పాటు చేశారు. ఇందువల్ల స్లాబ్‌పై నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తీగజాతి కూరగాయలు పెంచేందుకు తీగలతో పందిళ్లు వేశారు. మూడేళ్లుగా ఇంటి మీద తమకు కావాల్సిన కూరగాయల్ని పండిస్తున్నారు.
మల్లెపువ్వు.. సొరకాయ.. దానిమ్మ
నలుగురు కుటుంబ సభ్యులకు కావాల్సిన స్వచ్ఛమైన తాజా ఆకుకూరలు, కూరగాయలు పెంచుతున్నారు. ప్రస్తుతం మల్లె, జాజిమల్లె, నందివర్ధనం, రాఖీ పువ్వు, గులాబీ లాంటి 12 రకాల పూల మొక్కలు కనువిందు చేస్తాయి. ఏ సీజన్లో ఆ సీజన్ పూలు పూస్తాయి. సొరకాయ, బీరకాయ, కాకరకాయ, వంకాయ, చిక్కుడు కాయ, టమాట లాంటి కాయగూరలు, తోటకూర, గోంగూర, పాలకూర, కొత్తిమీర, పూదినలాంటి ఆకు కూరలు ఇంటి పైకప్పుపైనే పండుతున్నాయి. సీజన్‌ను బట్టి ఎప్పటికప్పుడు పంటల్ని మార్చుతారు. జామ, దానిమ్మ, డ్రాగన్, అంజీర, ద్రాక్ష లాంటి పండ్లు సైతం సీజన్‌ను బట్టి అందుబాటులో ఉంటాయి. మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరమే తమకు లేదంటున్నారు గవిని లత.