తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలమూరులో రోడ్డు విస్తరణను వాళ్లెందుకు వ్యతిరేకిస్తున్నారు?

మహబూబ్​నగర్​లో ప్రధాన రహదారి విస్తరణకు మరో అడుగు ముందుకు పడింది. రోడ్డు విస్తరణలో స్థలాలు, నిర్మాణాలు కోల్పోతున్న వారికి ట్రాన్స్ఫరబుల్ డెవలప్​మెంట్ రైట్ కింద నాలుగు రెట్ల విలువతో టీడీఆర్ పత్రాలు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. కొందరు స్వచ్ఛందంగా ముందుకు రాగా... మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. నగదు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

పాలమూరులో రోడ్డు విస్తరణను వాళ్లెందుకు వ్యతిరేకిస్తున్నారు?
పాలమూరులో రోడ్డు విస్తరణను వాళ్లెందుకు వ్యతిరేకిస్తున్నారు?

By

Published : Feb 10, 2020, 4:17 PM IST

పాలమూరులో రోడ్డు విస్తరణను వాళ్లెందుకు వ్యతిరేకిస్తున్నారు?

మహబూబ్ నగర్ పట్టణం గుండా వెళ్లే 167వ జాతీయ రహదారిని విస్తరించాలన్నది పాలమూరు వాసుల చిరకాల వాంఛ. హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్లే మార్గం కావడం, పట్టణానికి అదే ప్రధాన రహదారి అవడం వల్ల రోజూ ఈ మార్గం గుండా వేలాది వాహనాలు వెళుతుంటాయి. పాలమూరు పురపాలికలో రద్దీ అధికంగా ఉండే రోడ్డూ అదే. ఈ మార్గాన్ని పద్మావతి కాలనీ నుంచి వన్ టౌన్ కూడలి వరకూ 120 అడుగుల రహదారిగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ.. భవన యజమానులు, దుకాణ దారులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రోడ్డు విస్తరణకు ఇప్పటికే టెండర్ పూర్తి కాగా.. విస్తరణ పనులు సైతం ప్రారంభమయ్యాయి. 120 అడుగుల వరకూ స్థలాలు, భవనాలు, నిర్మాణాలు కోల్పోతున్న వారికి మున్సిపాలిటీ అధికారులు మార్కింగ్ చేసి నోటీసులు జారీ చేశారు. మార్కింగ్ లోపల ఉన్న తాత్కాలిక నిర్మాణాలను తొలగించారు. ఈ నేపథ్యంలో స్థలాలు, భవనాలు, నిర్మాణాలు కోల్పోతున్న యజమానులు తమ పరిస్థితి ఏంటని.. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.

ఎవరికీ నష్టం ఉండదు:

120 అడుగుల రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న వాళ్లు ఆ స్థలాల్ని మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్​కు దాన దస్తావేజు కింద రాసి ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన వారికి ట్రాన్స్ఫరబుల్ డెవలప్​మెంట్ రైట్ కింద నాలుగు రెట్ల విలువతో టీడీఆర్ పత్రాలు జారీ చేస్తారు. ఈ టీడీఆర్​లను సొంత భవన నిర్మాణాలకు వినియోగించుకోవచ్చు. లేదా ఇతరులకు కూడా బదిలీ చేసుకోవచ్చు. ప్రభుత్వ ప్రతిపాదనకు చాలామంది సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో ఎవరినీ బలవంతం చేయడం లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. టీడీఆర్ కోసం స్వచ్ఛందంగా ముందుకు రాని వాళ్ల నుంచి నిబంధనల మేరకు భూసేకరణ జరపుతామని వివరించారు. 100 అడుగుల రహదారి, ఇరువైపులా 10 అడుగుల మేర ఫుట్ పాత్ నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. భూసేకరణలో ఎవరికీ నష్టంలేకుండా సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

నాలుగు రెట్లు నగదు పరిహారం:

ప్రభుత్వ ప్రతిపాదనను కొందరు సమర్థిస్తుండగా కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 120 అడుగులు కాకుండా 100 అడుగులకే విస్తరణ చేపట్టాలని కోరుతున్నారు. టీడీఆర్ పత్రాల కంటే 4 రెట్ల నగదు పరిహారం చెల్లిస్తే మేలు జరుగుతుందని అభిప్రాయ పడుతున్నారు. విస్తరణలో కొంత భూమి కోల్పోయి.. కొంత మిగిలి ఉన్న వాళ్లకు టీడీఆర్ ద్వారా ప్రయోజనమున్నా.. మొత్తం స్థలం కోల్పోయే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పాలమూరుకు రెండు బైపాస్​ల నిర్మాణానికి ప్రతిపాదనలుండగా.. మధ్యలో ఈ మార్గాన్ని విస్తరించాల్సిన అవసరం ఏముందనేది ఇంకొందరి ప్రశ్న.

భవన యజమానులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశంతో మరో అడుగు ముందుకు పడింది. వీలైనంత త్వరగా విస్తరణ పనులు పూర్తి చేయాలని జనం కోరుతుండగా... స్థలం కోల్పోతున్న వాళ్లు మాత్రం ససేమిరా అంటున్నారు.

ఇవీ చూడండి:సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details