ఆర్టీసీకి అద్దెబస్సులను నడుపుతున్న వాహన యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆర్టీసీ 388 అద్దె బస్సులు నడుస్తున్నాయి. మార్చి 22 నుంచి మే వరకూ లాక్‌డౌన్ విధింపుతో ఆర్టీసీ అన్నిరకాల సర్వీసుల్ని నిలిపివేసింది. అద్దెబస్సుల యజమానుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బకాయిపడ్డ డబ్బులు అందక యజమానులు బస్సులు నడపలేని పరిస్థితి నెలకొంది. బస్సు నడిచినా, నడవకపోయినా నెలవారీ ఫైనాన్స్ చెల్లించక తప్పదు. ఆదాయం లేక వడ్డీల భారం పెరిగిపోతోంది.
బకాయిలు చెల్లించాలి..
ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ బస్సులను మాత్రమే నడపాలని అధికారులు నిర్ణయించారు. గ్రామాల నుంచి ముఖ్య పట్టణాలకు వచ్చేరూట్లలో నడిచే అద్దెబస్సులు ఆగిపోయాయి. మహబూబ్‌నగర్ డిపో పరిధిలో 12 బస్సులను మాత్రమే పునరుద్ధరించగా మిగిలినవి ఇళ్లకే పరిమితమయ్యాయి. పూర్తి బకాయిలు చెల్లించి పల్లెవెలుగు బస్సులు నడపాలని యజమానులు కోరుతున్నారు. మహబూబ్‌గర్ రీజియన్ పరిధిలోనే ఆర్టీసీ రూ.7 కోట్ల 94లక్షలు చెల్లించాల్సి ఉందని అద్దెబస్సుల యజమానులు చెబుతున్నారు.