PM Modi Telangana Tour Today : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించేందుకు ప్రధాని మోదీ నేడు పాలమూరు(Modi Palamuru Tour) జిల్లాకు రానున్నారు. కేంద్రం చేపట్టిన రూ.13 వేల 500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితమివ్వనున్నారు. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీ.. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు పురపాలిక పరిధిలో అమిస్తాపూర్ శివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే పాలమూరు ప్రజాగర్జన సభలో మోదీ పాల్గొననున్నారు. అంతకుముందు రూ.13 వేల 545 కోట్లతో చేపట్టనున్న పలు అధికారిక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. సభ ముగిసిన తర్వాత శంషాబాద్ విమానాశ్రయం చేరుకొని దిల్లీకి తిరుగు పయనమవుతారు.
BJP Palamuru Praja Garjana Public Meeting :పాలమూరులో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లోపలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారు. వరంగల్ - ఖమ్మం, ఖమ్మం - విజయవాడ నాలుగు వరుసల రహదారి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. రూ.1,932 కోట్లలతో కృష్ణపట్నం - హైదరాబాద్ మధ్య మల్టీ ప్రోడక్ట్ పైప్‌లైన్‌కు శంకుస్థాపన చేస్తారు. రూ.2 వేల 457 కోట్లతో నిర్మించిన సూర్యాపేట - ఖమ్మం నాలుగు వరుసల రహదారిని మహబూబ్‌నగర్ నుంచే ప్రారంభిస్తారు. రూ.505 కోట్లతో నిర్మించిన జక్లేర్- కృష్ణా కొత్త రైల్వే మార్గాన్ని ప్రధాని జాతికి అంకితం చేస్తారు. కృష్ణా స్టేషన్ నుంచి కాచిగూడ డెమూను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారు. రూ.2 వేల 661 కోట్ల విలువైన హసన్- చర్లపల్లి హెచ్‌పీసీఎల్, ఎల్పీజీ పైప్‌లైన్‌ను జాతికి అంకితమిస్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University)లో రూ.81.27 కోట్లతో నిర్మించిన భవనాల్ని వర్చువల్‌గా ప్రారంభిస్తారు.
మోదీ తెలంగాణ పర్యటనలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అన్నింటికీ సిద్ధం చేశాం. వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలోనూ బీజేపీ వస్తుంది. రాష్ట్రంలో బీజేపీ వస్తేనే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. పాలమూరు ప్రజలు ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నా. - డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు