ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగింది. గతంలో ఎన్నడూ లేనంతగా జూరాలకు ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. వరద తాకిడికి జూరాల ప్రాజెక్టు అన్ని గేట్లను తెరచి నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు వరద ఉద్ధృతికి జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో ఇళ్లు నీట మునిగాయి. ముందే అప్రమత్తమైన అధికార యంత్రాంగం ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వనపర్తి జిల్లాలో జల దిగ్బంధంలో చిక్కుకున్న పలువురిని పోలీసులు కాపాడారు. కేవలం పంట నష్టం మినహా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
జలాశయాలకు భారీగా వరద
గతంలో ఎన్నడూ లేని విధంగా జూరాలకు వరద నీరు పోటెత్తింది. పదేళ్ల తర్వాత దాదాపు 9 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 62 గేట్ల ద్వారా ఎనిమిదిన్నర లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతిని తట్టుకోవడానికి జూరాలలో నీటి నిల్వను ఐదున్నర టీఎంసీలకు తగ్గించారు. ఈ వరద మరో 24 గంటలు కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రజల తరలింపు
కృష్ణానది ఉప్పొంగడం వల్ల నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో వాసునగర్ పూర్తిగా నీట మునిగింది. హిందూపూర్‌లోని ఎస్సీ వాడల్లో ఇళ్లలోకి నీరు చేరి అక్కడి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా-హిందూపూర్, కృష్ణా-గురజాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మక్తల్ పసుపుల, వల్లభాపూర్, కురిమిగడ్డలో ఆలయాలు నీటమునిగాయి. నారాయణపేట కలెక్టర్ వెంకట్రావు వరద ఉద్ధృతిపై సమీక్ష నిర్వహించారు. ముంపునకు అవకాశం ఉన్న ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేక అధికారిని నియమించారు. జిల్లా ఎస్పీ చేతన సైతం ముంపునకు అవకాశం ఉన్న ముడుమాల్‌లో పరిస్థితిని పరిశీలించారు. ఎవరూ నదీ తీరాల్లోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.