People Are suffering Due To Medicine Prices Hike : ఆహారపు అలవాట్లు, జీవనశైలి, కాలుష్యం వంటి కారణాలతో ఇప్పటికే ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు.. మందులు వాడుతూనే ఉంటారు. క్రమం తప్పకుండా ఔషధాలు వాడే వారికి, ఆసుపత్రుల్లో చేరిన ఇన్ పెషెంట్లకు.. పెరిగిన మందుల ధరలు భారంగా మారుతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 857 రకాల మందులపై 12 శాతం ధరల్ని పెంచుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. కొన్ని కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించాయి.
10 నుంచి 20 శాతం ఔషదాల ధరలు పెరిగాయి:దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి నెలకు రూ.1000 అయ్యే ఖర్చు.. ఇప్పుడు రూ.1200ల వరకు పెరిగింది. రోగుల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా.. వైద్యులు ఎక్కువగా మల్టిపుల్ కాంబినేషన్ మందులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటిపైనా 10 నుంచి 20 శాతం ధరలు పెరగటం వినియోగదారులకు భారంగా మారుతోంది. రక్తపోటు, మధుమేహం, కిడ్నీ, గుండె, శస్త్రచికిత్సలో వినియోగించే ఔషధాల ధరలు పెరిగాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా గుర్తింపు పొందిన ఔషధ దుకాణాలు, 322 మెడికల్ ఏజెన్సీలు ఉన్నాయి.