Bandaravipakula Village Problems : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఆగస్టు నాటికి ఉదండపూర్ వరకూ నీళ్లు ఎత్తిపోయాలనే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పనులు చేపడుతోంది. కానీ ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన ముంపు గ్రామాలకు పరిహారం చెల్లింపులు, పునరావాస కల్పన విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరావిపాకుల గ్రామం.. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఏదుల జలాశయంలో ముంపుకు గురవుతోంది.
palamuru rangareddy project Residents problems :జలాశయం నిర్మాణం దాదాపుగా పూర్తికాగా... ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతోంది. వానాకాలంలో వరద పెరిగినా, జలాశయంలో నీళ్లు నింపాలని ప్రభుత్వం నిర్ణయించినా.... బండరావిపాకుల ముంపునకు గురికాక తప్పదు. అయినా ఇప్పటికీ ఆ గ్రామం ఖాళీ కాలేదు. 25శాతం జనాభా ముంపు గ్రామంలోనే నివసిస్తున్నారు. చెల్లించాల్సిన పరిహారం,పునరావాసం పూర్తిస్థాయిలో అందకపోవటంతో దిక్కుతోచనిస్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు.
అందని పరిహారాలు : బండరావిపాకులలో 494 ఇళ్లు ముంపునకు గురవుతుండగా.... 978 కుటుంబాలు నిరాశ్రయులవుతున్నాయి. ఒక్కో కుటుంబానికి రూ.12.54లక్షలు, 18ఏళ్లు పైబడి వివాహం కానివారికి రూ.5లక్షల చొప్పున రూ.102 కోట్ల పరిహారం చెల్లించారు. కానీ సర్వేలో పేరు రానివాళ్లు, 18 ఏళ్లు నుండి పరిహారం రాని వాళ్లు ఇంకా ఉన్నారని గ్రామస్థులు చెబుతున్నారు. 978కుటుంబాలు నిరాశ్రయులవుతుండగా, 494ఇళ్లకు మాత్రమే పునరావాసం కింద తిరిగి ఇళ్ల స్థలాలు కేటాయించారని.... ఇళ్లకు పరిహారం చెల్లించి, ఖాళీస్థలాలకు ఇవ్వలేదని వాపోతున్నారు. పరిహారం అంచనాల్లోనూ అవకతవకలు జరిగాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
ముంపుకు గురయ్యే గుడిసెలు, రేకుల ఇళ్లకూ పరిహారం అందినా.... అరకొర పరిహారంతో కేటాయించిన స్థలంలో ఇళ్లు నిర్మించుకోలేని దుస్థితి. దీంతో ముంపులో ఉండలేక,పునరావాస గ్రామానికి వెళ్లలేక, ప్రభుత్వం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్లలోనే పలు కుటుంబాలు కాలం వెళ్లదీస్తున్నాయి. ముంపు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల శిథిలావస్థకు చేరింది. మంచి నీళ్లు.... మరుగుదొడ్లు లేవు. మధ్యాహ్న భోజనం కూడా అందుబాటులో లేదు. ముంపు గ్రామం కావడంతో అక్కడి సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పునరావాస గ్రామంలో కొత్త పాఠశాల నిర్మించాల్సి ఉన్నా...అది జరగలేదు. దీంతో పునరావాస గ్రామానికి తరలి వెళ్లిన 30కి పైగా విద్యార్ధులు బస్సులో వచ్చి పాత గ్రామంలోనే చదువుకోవాల్సి వస్తోంది. విద్యార్ధుల సంఖ్య కూడా పడిపోయింది. జలాశయంలోకి నీరు చేరితే ఈ ఏడాది ఆ పాఠశాల నడవడం కూడా కష్టంగానే మారింది.
"ఇంకా కొంత మందికి ఫ్లాట్లు రావాలి. డబ్బులు రావాలి 18 ఏళ్లు నిండిన వారికి ఫ్లాటు, 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఏవీ ఇవ్వడం లేదు. ఇప్పుడు నీళ్లు వదులుతాం అంటున్నారు అలా చేస్తే మా ఇళ్లు అన్ని మునిగిపోతాయి. ప్రభుత్వం నుంచి ఏదైనా పరిహారం వస్తే మేము ఇల్లు కట్టుకుంటాం." - బాధితులు