ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2020-21 యాసంగి సీజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 5లక్షల 80వేల ఎకరాల్లో రైతులు వరిపంటను సాగు చేశారు. నీటి లభ్యత అధికంగా ఉండటం, వాతావరణం అనుకూలించడంతో పంటలు బాగా పండాయి. సుమారు 14లక్షల మెట్రిక్ టన్నుల వరకూ దిగుబడులు వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ప్రైవేటు అమ్మకాలు, రైతుల అవసరాలు పోను.. 9లక్షల 20వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కొవిడ్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని 800లకు పైగా కొనుగోలు కేంద్రాలను తెరిచింది. కానీ ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు ఈసారి నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. ఆర్థికంగా దోపిడికి గురి కావాల్సి వచ్చింది. దశల వారీగా కొనుగోలు కేంద్రాలు తెరిచినా... కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే లారీలు రాకపోవడంతో చాలా చోట్ల కొనుగోళ్లు ఆగిపోయాయి. పంటను అమ్ముకునేందుకు రోజుల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు పడాల్సి వచ్చింది. సరిపడా టార్పాలిన్లు లేక కిరాయికి తీసుకువచ్చి ధాన్యం తడవకుండా కాపాడుకున్నారు. రోజువారీ ఖర్చులూ తడిసిమోపెడయ్యాయి. ధాన్యాన్ని కొనుగోలు చేసినా ప్రభుత్వం భరించాల్సిన హమాలీ సహా ఇతర ఖర్చులు ఈసారి రైతులే భరించాల్సి వచ్చింది.
సొంత ఖర్చులతో
ధాన్యాన్ని తరలించాల్సిన రవాణా ఏజెన్సీలు లారీలు పంపడంలో విఫలం కావడంతో రైతులే సొంత ఖర్చులతో ట్రాక్టర్లతో ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. కానీ సకాలంలో మిల్లుల్లో ధాన్యం దించుకోలేక పోవడంతో వారం నుంచి పక్షం రోజుల వరకూ రైతులు మిల్లుల వద్ద పడిగాపులు పడాల్సివచ్చింది. రోజులు గడుస్తున్న కొద్దీ ట్రాక్టర్ కిరాయిలు మీద పడ్డాయి. రోజువారీ ఖర్చులు అదనం. రవాణా ఏజెన్సీలే రైతులకు ట్రాక్టర్ కిరాయిలు చెల్లించాలని చెప్పినా... ఇప్పటికీ చాలామంది రైతులకు ఆ డబ్బులు అందలేదు. పంటను అమ్ముకునేందుకు రైతులే ఎదురు ఖర్చుపెట్టాల్సి వచ్చింది. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు తరలించేందుకు క్వింటా నిర్దిష్ట రుసుము చొప్పున మాత్రమే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నారు. కానీ వారం, పది రోజుల పాటు ఒక్కో ట్రాక్టరుకు రైతులు కిరాయిలు చెల్లించాల్సి వచ్చింది. ఆ డబ్బులు తిరిగొచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం భరించాల్సిన రవాణా ఖర్చులు రైతులపై పడటంతో తాము తీవ్రంగా నష్టపోయామని అన్నదాతలు వాపోతున్నారు.
కోతల కష్టాలు
తరుగు పేరిట ఈసారి దోపిడీ కొనసాగింది. కొనుగోలు కేంద్రాల వద్ద బస్తా 40కిలోలు, అదనంగా తరుగు పేరిట 600గ్రాముల ధాన్యాన్ని తూకం వేయాల్సి ఉంటుంది. కానీ తాలు, ఇతర కారణాల పేరిట కొనుగోలు కేంద్రాల్లోనే 41 కిలోలపైన 300 గ్రాముల నుంచి 600 గ్రాముల వరకూ బస్తాలను తూకం వేశారు. తూకంవేసి ఒకసారి ట్రక్ షీట్ రాశాక, తూకంలో ఏవైనా తేడాలుంటే తప్ప ట్రక్ షీట్ మార్చేందుకు వీలులేదు. కానీ మిల్లుల్లో ధాన్యం దింపేందుకు మిల్లర్లు బస్తాకు కిలో, 2కిలోల చొప్పున అదనంగా కోత విధించి ట్రక్ షీట్ లో మార్పులు చేశారు. ధాన్యాన్ని మిల్లుల్లో దింపేందుకే వారం, పది రోజుల పాటు పడిగాపులు పడిన రైతులు... చేసేది లేక మిల్లర్లు చెప్పిన తూకానికే ట్రక్ షీట్లు తీసుకుని వెనుదిరగాల్సి వచ్చింది. అలా బస్తాకు కిలో నుంచి మూడు కిలోల వరకూ ధాన్యపు సొమ్మును ఈసారి కోల్పోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.