Onion prices fall in Telangana: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉల్లి పండించిన రైతులు బహిరంగ మార్కెట్లో ధరలు పతనమై తీవ్రంగా నష్టపోతున్నారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్లో ఉల్లిధరలు గరిష్టంగా క్వింటాకు రూ. వెయ్యి.. కనిష్టంగా రూ. 400, నాణ్యత తగ్గితే కేవలం క్వింటా 200 రూపాయలకు మాత్రమ కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పెరిగిన దిగుబడులు.. మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లోని వివిధ మండలాల్లో సుమారు 5 నుంచి 8వేల ఎకరాల్లో రైతులు ఉల్లి సాగు చేశారు. ఈసారి ఉల్లి దిగుబడులు బాగా వచ్చాయి. కాని అమ్ముకుందామని మార్కెట్లకు వెళ్తే ధరలు అంతంత మాత్రంగా ఉన్నాయి. గడ్డ ఏరేందుకు ఒక్క కూలీని నియమిస్తేనే 500 రూపాయలు చెల్లించాలి. అలాంటిది క్వింటా 500 రూపాయలకు కూడా ధర పలకకపోతే పెట్టుబడులైనా తిరిగి వచ్చేదెలా అని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేరుగా విక్రయం.. మార్కెట్ లో ధరలు లేకపోవడంతో కొందరు ఉల్లిరైతులు ఇల్లిల్లూ తిరిగి గడ్డను అమ్ముకుంటున్నారు. వ్యాపారులకు కిలో 2 రూపాయలకు అమ్మేబదులు నేరుగా వినియోగదారులకు కిలో 3 నుంచి 5 రూపాయల వరకూ అమ్ముతున్నారు. దానివల్ల కనీసం కూలీ ఖర్చులు పెట్టుబడులైన చేతికందుతాయని భావిస్తున్నారు. మరోమూడు వారాలపాటు ఉల్లి దిగుబడులు గణనీయంగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ధరలు ఇంకా పతనమవుతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.