ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన జాతీయ రహదారుల్లో ముఖ్యమైనది ఎన్‌హెచ్-167. కర్ణాటక రాష్ట్రంలోని హగరి నుంచి ప్రారంభమై సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఈ రహదారి ముగుస్తుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నుంచి నారాయణపేట జిల్లా కృష్ణా చెక్ పోస్టు వరకు ఈ జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ రోడ్డు విస్తరణ పనులు దాదాపు పూర్తి కాగా.. మరికల్ నుంచి కృష్ణా చెక్ పోస్ట్, జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ పట్టణం వన్ టౌన్ పోలీసు స్టేషన్ వరకూ విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ పట్టణం వరకూ 16.6 కిలోమీటర్ల రహదారిని విస్తరించాల్సి ఉండగా 60శాతం పనులు పూర్తయ్యాయి. రూ.170 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులకు ఇప్పటి వరకూ రూ.100 కోట్లు ఖర్చు చేశారు. భూసేకరణ సమస్యల కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. మయూరీ హరితవనం వద్ద భూసేకరణ సమస్యల కారణంగా 300 మీటర్ల రోడ్డు విస్తరణ ఆగిపోయింది.
వివాదాలున్న చోట ఆలస్యం
అప్పనపల్లి వద్ద మరో 1200 మీటర్ల రోడ్డుకు భూమిని సేకరించాల్సి ఉంది. అక్కడ 30కోట్లతో ఆర్వోబీ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇవి కాకుండా పట్టణంలో రోడ్డు విస్తరణపై కొందరు కోర్టును ఆశ్రయించడం, కొందరు నిరాకరించడం, ప్రార్థనా మందిరాలు తొలగింపు అంశం, తదితర కారణాల వల్ల పని ఆలస్యమవుతోంది. రెయిలింగ్, డివైడర్లు, ఫుట్‌పాత్‌లు, భూగర్భ మురుగు కాల్వల పనులు పురోగతిలో ఉన్నాయి. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. వివాదాల పరిష్కారం, భూసేకరణ పూర్తైతే ఈ రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది.
త్వరగా పూర్తి చేస్తాం
జడ్చర్ల - మహబూబ్‌నగర్ రోడ్డు విస్తరణ పనుల్లో భూసేకరణ పూర్తి కావాల్సి ఉంది. అవసరమైన భూమిని గుత్తేదారుకు అప్పగించిన 9 నెలల్లో పనులు పూర్తి చేస్తాం. మిగిలిన చోట్ల పనులు పురోగతిలోనే ఉన్నాయి. కోర్టు కేసులు, వివాదాలున్నచోట పనులు ఆలస్యమవుతున్నాయి. సెంట్రల్ లైటింగ్ ప్రారంభించాల్సి ఉంది. మరికల్ నుంచి చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్ని మే నెలాఖరు నాటికి పూర్తి చేస్తాం.-రమేశ్‌బాబు, డీఈఈ, నేషనల్ హైవేస్, మహబూబ్‌నగర్
రెండేళ్లుగా కొనసాగుతున్న పనులు
మరికల్ నుంచి నారాయణపేట జిల్లా తెలంగాణ సరిహద్దు వరకూ 45 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు పురోగతిలోనే ఉన్నాయి. మరికల్ మండలం ఎలిగండ్ల వాగు, మక్తల్ మండలం బొందలకుంట, మాగనూరు మండలం పెద్దవాగు, గుడబల్లేరు వద్ద వంతెనలు నిర్మాణం కాలేదు. మక్తల్, మాగనూర్ గ్రామాల్లో రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గుడబల్లేరులో రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉంది. రూ.160కోట్లతో పనులు చేపట్టగా ఇప్పటి వరకూ రూ.112 కోట్లు ఖర్చు చేశారు. 68 శాతం పనులు పూర్తయ్యాయి. గ్రామాల్లో విస్తరణ పనుల్లో జాప్యం కారణంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రెండేళ్లుగా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.