తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజుకొంటున్న మున్సిపల్​  వే..ఢీ - MUNCIPAL

మహబూబ్‌నగర్‌ వార్డుల విభజనపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. నేడు పూర్తి వివరాలతో హాజరుకావాలని ధర్మాసనం కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు కేసుతో అధికారులు మక్తల్‌లో జాబితా ప్రకటించలేరు. మిగతాచోట్ల మాత్రం వార్డుల కుల గణన తుది జాబితాను వెల్లడించారు.

http://10.10.5రాజుకొంటున్న వేఢీ0.85:6060//finalout4/telangana-nle/thumbnail/17-July-2019/3861559_729_3861559_1563335263681.png

By

Published : Jul 17, 2019, 1:03 PM IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మక్తల్‌ పురపాలిక మినహా ఎన్నికలు జరగనున్న మిగతా 16 మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా కులగణన తుది జాబితాను పుర అధికారులు మంగళవారం విడుదల చేశారు. మక్తల్‌ పురపాలికలోని 6, 7 వార్డుల విభజన సరిగా జరగలేదంటూ స్థానికులు హైకోర్టుకు వెళ్లారు. చట్ట నిబంధనల ప్రకారం వార్డుల విభజన చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై తుదితీర్పు ప్రకటించకపోవడం వల్ల మక్తల్‌ పురపాలికలో మంగళవారం వార్డుల కులగణన తుది జాబితాను ప్రకటించలేదు.

విభజన సక్రమంగా జరగలేదు

మహబూబ్‌నగర్‌ పురపాలికలోనూ వార్డుల విభజన సక్రమంగా జరగలేదంటూ పట్టణానికి చెందిన రాఘవేందర్‌ రాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ పి.నవీన్‌రావు మంగళవారం విచారణ జరిపారు. పురపాలిక కమిషనరు సురేందర్‌తో పాటు పట్టణ ప్రణాళికావిభాగం అధికారులు కోర్టుకు హాజరయ్యారు. పిటిషనరు లేవనెత్తిన ఏడు అంశాలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిల్లలమర్రి ప్రాంతానికి చెందిన ఓట్లను బీకే రెడ్డి కాలనీలో కలిపారని, ఒకే డోర్‌ నంబరు మీద 388 దొంగ ఓట్లు ఉన్నాయని పిటిషనరు కోర్టుకు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతోపాటు కొన్ని వార్డుల్లో ఓట్ల నిష్పత్తి సక్రమంగా లేదని, దీని ప్రభావం రిజర్వేషన్లపై పడనుందని ఆయన కోర్టుకు వివరించారు. ఇటీవల ఓ గ్రామం నుంచి గెలిచిన సర్పంచి కుటుంబం వివరాలు స్థానికంగా మరో వార్డులో పొందుపరిచారన్నారు. పిటిషనరు రాఘవేందర్‌ రాజు లేవనెత్తిన అంశాలపై బుధవారం కమిషనరు వివరణ ఇవ్వాలని హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. దీంతో మహబూబ్‌నగర్‌ పురపాలిక వార్డుల విభజనపై నీలినీడలు కమ్ముకున్నాయి.

దాదాపుగా ముసాయిదా జాబితానే..

ఈ నెల 10వ తేదీన వార్డుల వారీగా కులగణనకు సంబంధించిన ముసాయిదా జాబితాను విడుదల చేశారు. అభ్యంతరాలను 12వ తేదీ వరకు స్వీకరించి 13న పరిశీలించారు. తుది జాబితాను 14వ తేదీన ప్రకటించాల్సి ఉంది. ఫిర్యాదులు అధికంగా రావడం, పలు పురపాలికలకు చెందిన నేతలు కోర్టుకు వెళ్లడంతో ఈ నెల 15వ తేదీ వరకు అభ్యంతరాలను పరిశీలించి 16న తుది జాబితా ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు జరగనున్న 16 పురపాలికల్లో ఓటర్లవారీగా తుది జాబితాను ప్రకటించారు. ఉమ్మడి పాలమూరులో మంగళవారం విడుదల చేసిన తుది జాబితాలో చిన్నచిన్న మార్పులు మాత్రమే చేశారు.

17 పురపాలికల్లో 5,21,453 మంది ఓటర్లు

ఈ నెల 10వ తేదీన ప్రకటించిన ముసాయిదా జాబితానే కొన్ని మార్పులతో ప్రకటించారు. దీని ఆధారంగానే పోలింగ్‌ బూత్‌ల కేటాయింపు, రిజర్వేషన్ల అమలు ఉండనుంది. ఉమ్మడి జిల్లాలోని ఓటర్ల తుది జాబితాను అధికారులు ఈ పాటికే విడుదల చేశారు. మక్తల్‌తో కలిపి మొత్తం 17 పురపాలికల్లో 5,21,453 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 338 వార్డులు ఉన్నాయి. ప్రతి 800 మంది ఓటర్లకు ఒక పోలింగు బూత్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వార్డులో 850 మంది కంటే ఎక్కువ ఓటర్లుంటే రెండు పోలింగ్‌ బూత్‌లు, 1700 మంది కంటే ఎక్కువ ఓటర్లుంటే మూడు పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతానికి పలు వార్డుల్లో 1,500 మంది ఓటర్లు ఎక్కడా దాటలేదు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 651 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటుచేసే అవకాశం ఉంది.

పోలింగ్‌ బూత్‌ల ఏర్పాట్లకు కసరత్తు

వార్డుల వారీగా పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటుపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రైవేటు విద్యా సంస్థలను పోలింగు కేంద్రాల కోసం పరిశీలిస్తున్నారు. వాటిలో మౌలిక వసతుల ఏర్పాట్లు, వెబ్‌కాస్టింగ్‌ నిర్వహణకు అనుకూలతను పరిశీలిస్తున్నారు. పోలింగు కేంద్రాల ముసాయిదాను బుధవారం అధికారులు ప్రకటించనున్నారు. అభ్యంతరాలను ఈ నెల 19వ తేదీ వరకు స్వీకరిస్తారు. వార్డుల వారీగా పోలింగు బూత్‌ల తుది జాబితాను 21వ తేదీన ప్రకటిస్తారు. ఆ లోపు పురపాలికల పరిధిలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పురాల్లో ఎన్నికల సందడి ఊపందుకోనుంది.

ఇవీ చూడండి: నేడే కేబినెట్ సమావేశం

ABOUT THE AUTHOR

...view details