SRINIVAS GOUD ON KCR NEW PARTY: ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తి జాతీయ పార్టీ పెట్టి దేశ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్లు దేశ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెరాస కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 17 రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు సహా పలు రాజకీయ పార్టీల నేతలు సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి కావాలని కోరుకుంటున్నాని శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. దేశంలో కావాల్సినన్ని నీళ్లున్నా.. సాగునీరు అందని భూములుండటం, కరెంటు ఉత్పత్తి ఉన్నా.. చాలా గ్రామాలకు చేరకపోవడం, పేదరిక నిర్మూలన, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ లాంటి అంశాల్లో కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తిపై నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం తగదని మండిపడ్డారు.
SRINIVAS GOUD ON KCR BIRTHDAY: ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయడంపై ముఖ్యమంత్రికి శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ముడా ఏర్పాటుతో మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్ ప్రాంతాల ముఖచిత్రమే మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని.. 15న పండ్లు, దుస్తుల పంపిణీ, 16న రక్తదాన శిబిరాలు, 17న మొక్కలు నాటడం చేపట్టాలని పిలుపునిచ్చారు.