పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పునరుద్ఘాటించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పాలమూరు-రంగారెడ్డి పథకం ద్వారా ప్రస్తుత మహబూబ్నగర్ జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే సర్వే పనులు పూర్తయ్యాయని.. కర్వేన, ఉద్దండపూర్ జలాశయ నిర్మాణ పనులు సైతం పురోగతిలో ఉన్నట్లు తెలిపారు.
ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేస్తాం: శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
గడిచిన ఐదేళ్లలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఐటీ కారిడార్, వైద్య కళాశాల సహా పలు రంగాల్లో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. జిల్లా సమగ్ర అభివృద్ధే తమ ధ్యేయమని అందుకోసం అహర్శిశలు శ్రమిస్తున్నామన్నారు. జిల్లాలో 2 కోట్ల 88లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని.. ఇప్పటికే 30లక్షల మొక్కలు నాటినట్లు శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. రూ. 43 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన కలెక్టర్ కార్యాలయం త్వరలోనే పూర్తి చేయనున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: స్వాతంత్ర్య వేడుకల వేళ... కశ్మీర్లో భద్రత కట్టుదిట్టం