మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలికల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జడ్చర్లలో 27 వార్డులు ఉండగా... 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 41,515 కాగా.. పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 66.60 పోలింగ్ శాతం నమోదైంది. ఉదయమే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి కనిపించారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ప్రతి ఓటరు మాస్కు ధరించి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి... బాదేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సుదర్శన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు జడ్చర్లలోని పోలింగ్ బూతులను తనిఖీ చేశారు. కొవిడ్ నిబంధనల అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. జడ్చర్ల పురఎన్నికల బరిలో మొత్తం 112 మంది అభ్యర్ధులు బరిలో ఉండగా వారి భవితవ్యం బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తమై ఉంది. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ పెట్టెలను బీఆర్ఆర్ డిగ్రీ కళాశాలోని స్ట్రాంగ్ రూం కు తరలించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలికలోనూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అచ్చంపేటలో మొత్తం 20వార్డులు ఉండగా.. 40 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలో 20,684 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా... 14వేల పైచిలుకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి 68 శాతం పోలింగ్ నమోదైంది. 2016లో జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో అచ్చంపేటలో 70 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా.. తొలుత మందకోడిగా ఉన్న జనం క్రమంగా పెరిగారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు 10వ వార్డులో, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు 20వ వార్డులో, నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీకృష్ణ 19వ వార్డులో... ఓటు హక్కు వినియోగించుకున్నారు.