Mahbubnagar Rains 2023 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. 15 రోజుల ముందు వరకు ఆశించిన వర్షంలేక ఏ పంటలు వేయాలన్న సందిగ్ధంలో ఉన్న కర్షకులు ప్రస్తుతం పంటల సాగుకి ముందుకెళ్తున్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వారంవరకి లోటు వర్షపాతం నమోదు కాగా.. ఇప్పుడు మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అధిక వర్షపాతం.. వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
Mahbubnagar Rains Updates : మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని 6మండలాల్లో అత్యధికంగా వానలు కురిశాయి. పాలమూరు జిల్లాలోసాగు ఊపందుకుంది. పాలమూరు జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 18 లక్షల ఎకరాలు కాగా.. ఈసారి 20లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారుల అంచనా. జూలై మొదటివారంలో సాగువిస్తీర్ణం 40 శాతం దాటలేదు. ఇప్పుడు వానలకు వరిసాగు ఊపందుకోనుంది. వరుణుడి కరుణ కోసం ఎదురుచూసిన అన్నదాతలు నార్లుపోసుకొని ఉంచారు. వర్షాలు కురవడం, భూగర్భ జలమట్టాలు పెరగడం.. జూరాల వంటి ప్రాజెక్టుకు వరద మొదలుకావడంతో బోరుబావులు, చెరువులు, కుంటలు సహా... సాగునీటి ప్రాజెక్టుల కింద వరి ఊపందుకోనుంది. సుమారు ఐదున్నర లక్షల ఎకరాల్లో.. ఈసారి వరి సాగయ్యే అవకాశం కనిపిస్తోంది.
"వర్షాలు పడటం వల్ల చెరువుల్లోకి నీరు చేరి కళకళలాడుతున్నాయి. ఇన్నాళ్లు నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు మేం పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది. బోర్లు ఉన్నవారు ముందుగానే పంట వేశారు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేం కూడా పంట వేస్తాం." - రైతులు
Telangana Rains 2023 : ఇటీవలి వర్షాలతో పత్తికి జీవంవచ్చింది. వర్షాభావ పరిస్థితి కొనసాగితే పంట నష్టపోవాల్సి వస్తుందని అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. కానీ అధిక వర్షం నమోదుకావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. 10 లక్షల ఎకరాల్లో పత్తిసాగవుతుందని అధికారులు అంచనా వేయగా..5లక్షలు దాటలేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా మే, జూన్‌లో వేసిన విత్తుల్ని రైతులు నష్టపోవాల్సి వచ్చింది.