కరోనా మహమ్మారి.. విద్యా విధానంలో సాంకేతికను తప్పనిసరి చేసింది. అన్ని రకాల విద్యా సంస్థలు మూతబడటంతో ఆన్‌లైన్ పాఠాలే శరణ్యమయ్యాయి. ఈ విద్యా సంవత్సరం జులై మొదటి వారం నుంచి ప్రారంభమైనా.. కేవలం ఉపాధ్యాయులు మాత్రం రోజు విడిచి రోజు వెళ్తున్నారు. ఆన్‌లైన్ తరగతులు లేకపోవడంతో టీశ్యాట్, దూరదర్శన్ టీవీల ద్వారా విద్యాశాఖ అందించే తరగతులు వినాలని సూచిస్తున్నారు. ఏ ఏ తరగతులకు ఏ పాఠ్యాంశాలు ఎప్పుడు వస్తాయన్నది మాత్రమే సమాచారం ఇస్తున్నారు. కానీ సాంకేతిక సమస్యల కారణంగా ఆశించిన స్థాయిలో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. టీవీల ద్వారా తరగతులు వింటున్న పదో తరగతి విద్యార్థులు పాఠ్యాంశాలను అందిపుచ్చుకోవడం లేదు. ఈ పద్ధతిలో పాఠ్యాంశాలు పూర్తి స్థాయిలో అర్థంకాకపోవటంతో పాటు సందేహాల నివృత్తికి అవకాశం లేదని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీవీల ద్వారా పాఠ్యాంశాలు సరిగా అర్థంకాక విద్యార్థులు నష్టపోతున్నారని గుర్తించిన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్ట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయలు అందుకు పరిష్కార మార్గం కనిపెట్టారు. టీశాట్, దూరదర్శన్‌లో ఆన్‌లైన్ లైవ్ తరగతులతో పాటు టీచ్‌మింట్ యాప్ ద్వారా తమ విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా పాఠాలు చెబుతున్నారు.
ప్రత్యక్ష బోధనలాగానే
టీవీలో వచ్చే పాఠాలతో పాటు సిలబస్ ప్రకారం ప్రతి రోజూ గణితం, సైన్స్, ఇంగ్లీషు సబ్జెక్ట్‌లను బోధిస్తున్నారు. ప్రత్యక్ష బోధన విధానంలో తరగతి గదుల్లో ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను ఎలా అయితే అర్థవంతంగా బోధించేవారో.. విద్యార్థులు తమ సందేహాలను ఎలా నివృత్తి చేసుకునేవారో.. ఆన్‌లైన్ బోధనలోను అదే విధంగా ఉండేటట్లు చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రశ్నలు వేస్తూ.. సమాధానాలు రాబడుతున్నారు. విద్యార్థుల హజరు సంఖ్యతో పాటు.. హోమ్ వర్క్‌లను ఇస్తూ... గూగుల్ షీట్స్ ద్వారా పరిశీలిస్తున్నారు. జూమ్, గూగుల్‌మీట్, యూట్యూబ్, తదితర సాంకేతిక సౌకర్యాలతో పాటు వీలైనప్పుడు తరగతులు వినేలా ప్రత్యేకంగా పాఠాలు రూపొందిస్తున్నారు. విద్యార్థులు నష్టపోకుండా తమ వంతు సహకారం అందిస్తున్నారు.
టీవీ బోధనలో సమస్యలు
కరోనా మహమ్మారి కారణంగా మొదటి, రెండో దశలో విద్యార్థులు పాఠశాలలకు దూరమయ్యారు. ఈ ఏడాది తరగతులను ప్రారంభించినా.. టీవీల ద్వారా పాఠ్యాంశాలను అందిస్తున్నా.. విద్యార్థులకు పూర్తి స్థాయిలో అర్థం కావడం లేదు. దాంతో పాటు సందేహాల నివృత్తికి అవకాశం లేకపోవడంతో తరగతులు సరిగా అర్థం కావడం లేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. గతేడాది మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడంతో కొంత మేర ప్రత్యక్ష బోధన మాదిరిగా ఉండటం.. విద్యార్థులకు తెలిసిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఉండటం.. ప్రాంతీయ యాస, భాషలో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించడంతో విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టకపోవడంతో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్ట ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు టీచ్‌మింట్ యాప్ ద్వారా తమ పాఠశాల విద్యార్థులకు ప్రతి రోజూ ప్రత్యక్ష బోధన విధానంలో పాఠ్యాంశాలను అందిస్తున్నారు.