దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించేందుకు అమలు చేస్తున్న రేషన్ కార్డుల జారీ.. పేద కుటుంబాలకు అందని ద్రాక్షగానే మిగులుతోంది. దాదాపు రెండేళ్ల నుంచి కొత్త కార్డులు జారీకాక వాటికోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది లాక్డౌన్ సమయంలో రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం అందించిన బియ్యమే ఎన్నో పేద కుటుంబాల కడుపు నింపింది. ఆ సమయంలో కార్డులు లేని కుటుంబాలు ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది.
ఇక్కట్లు తప్పట్లేదు
ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందడానికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవద్దని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చినా, ఇప్పటికీ వివిధ ప్రభుత్వ పథకాల్లో అర్హతను నిర్ణయించేందుకు కార్డు వివరాలను సేకరిస్తున్నారు. సంక్షేమ ఫలాలు పొందేందుకు ఎక్కువ మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం లాంటి ధ్రువపత్రాల జారీ కోసం అధికారులు ఆహార భద్రత కార్డును పరిగణలోకి తీసుకుంటున్నారు. చౌకధరకు సరుకులు పొందడం కోసమే కాకుండా ధ్రువపత్రాల జారీకీ రేషన్ కార్డు కీలకం కావడం వల్ల.. కార్డు లేని వాళ్లకు క్షేత్రస్థాయిలో ఇక్కట్లు తప్పడం లేదు. రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగినా కార్డులు చేతికందడం లేదు.
64 వేల 631 దరఖాస్తులు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 9 లక్షల 19 వేల 999 ఆహార భద్రత కార్డులుండగా.. 31.35 లక్షలమంది లబ్ది పొందుతున్నారు. 20,047 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతినెల 5జిల్లాల వ్యాప్తంగా సరఫరా అవుతోంది. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత 64,631 మంది ఆహార భద్రత కార్డులు కావాలని మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను తొలుత రెవిన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దార్లు పరిశీలించి అర్హులైతే జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారికి సిఫార్సు చేస్తారు. అర్హులైన నిరుపేదలకు ఆ శాఖ ఆహార భద్రత కార్డు జారీ చేస్తుంది. కానీ.. రెండేళ్లుగా కొత్త కార్డు కోసం చేసిన దరఖాస్తులు ఇప్పటికీ అపరిష్కృతంగానే మిగిలి ఉన్నాయి.
పెండింగ్లో 14వేల దరఖాస్తులు
ఉమ్మడి జిల్లాలో 14వేలకు పైగా దరఖాస్తులు జిల్లా పౌరసరఫరా శాఖ అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నాయి. మార్పులు, చేర్పులు, సవరణలకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం జాప్యమవుతోంది. 1,60,390 దరఖాస్తులు వస్తే 25,577 జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల వద్ద ఇప్పటికీ పరిశీలనలోనే ఉన్నాయి. 2016 వరకూ దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు 2018లో మోక్షం కలిగింది. కార్డుల్లోంచి యూనిట్లను తొలగించాల్సిన దరఖాస్తులను పరిష్కరిస్తున్న అధికారులు కొత్త యూనిట్లు చేర్చడం, సవరణలను మాత్రం పరిష్కరించకుండా వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొత్త కార్డులు జారీ చేసి రెండేళ్లు దాటిపోయినందున ఇప్పటికైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని దరఖాస్తు దారులు కోరుతున్నారు.
ఆదుకోండి
రెండేళ్ల కిందట నాకు వివాహమైంది. ఏడాది కిందట కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటికీ రాలేదు. లాక్ డౌన్ సమయంలోనూ నా కుటుంబానికి బియ్యం అందలేదు. కూలీ చేసుకుని బతికే కుటుంబం మాది. వీలైనంత త్వరగా రేషన్ కార్డు అందించి మమ్మల్ని ఆదుకోవాలి.