KTR Speech at Mahabubnagar Tour : మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సహచర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డితో కలిసి జడ్చర్లలో 560 రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. 55 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కరెంటు, నీళ్లు ఇయ్యలేదని, ఇవాళ మళ్లీ వచ్చి నక్క వినయాలు ప్రదర్శించుకుంటూ.... మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఏం అవసరమని... కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు.
KTR fires on Congress : కాంగ్రెస్ వాళ్లు ఎన్ని కేసులు పెట్టినా, బీజేపీ కృష్ణా జలాలు పంచకపోయినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలను తీసుకువచ్చి... ఈ ఆగష్టు వరకు కర్వేన జలాశయం నింపుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ అయిన ఈ కాంగ్రెస్ అధ్యక్షుడికి... పొరపాటున ఓటు వేస్తే మళ్లీ రూ.200 పింఛను, 3 గంటల కరెంట్ వస్తదన్నారు. కాంగ్రెస్ వారిని నమ్ముకుంటే మళ్లీ శంకరగిరి మాన్యాలే దిక్కని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పాదయాత్రలు చేసుకుంటూ వాళ్లు ఎన్ని తిట్లు తిట్టినా ఈసారి 90వేల ఓట్లతో గెలిపించి సన్యాసులకు సమాధానం చెప్పాలని కోరారు.
'55 ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా ? ఇప్పుడు పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారు ? వాళ్ల పాలనలో కరెంట్ సక్రమంగా వచ్చేది కాదు. గతంలో అధికారంలో ఉన్నవాళ్లు ఏపని చేయలేదు. మహబూబ్‌నగర్ పట్టణంలో 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేవి. ఆనాడు ఒక్కడు చెరువులను, తాగునీళ్ల సమస్యను పట్టించుకోలేదు. పరిశ్రమలు తీసుకురావాలనే ఆలోచన చేయలేదు.పెన్షన్‌లను ఇచ్చిన పరిస్థితి లేదు.'-కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి