Water level low in Jurala Project :రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి జలకళ సంతరించుకుంటున్నా.. కృష్ణానది దానిమీద ఆధారపడ్డ ప్రాజెక్టులు మాత్రం వెలవెలబోతున్నాయి. తెలంగాణలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కి ముందుగా ప్రవేశించే తొలి ప్రాజెక్టు జూరాల.. ఇప్పటి వరకూ దీనికి ఎలాంటి వరద దరిచేరలేదు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రమంతా అతలాకుతలమవుతున్నా.. పాలమూరు జూరాలకు మాత్రం నీటి సవ్వడి కరవైంది. కేవలం ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రాల్లో అధిక వర్షాలు లేకపోవడమే అందుకు ప్రధాన కారణం.
ఎగువన ఉన్న ఆలమట్టికి ప్రస్తుతం 32వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతోంది. ఆలమట్టి పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 129 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 32టీఎంసీల నీటినిల్వ మాత్రమే ఉంది. ఆలమట్టికి దిగువన ఉన్న నారాయణపూర్ జలాశాయానికి కూడా వరద లేదు. దీని నీటినిల్వ సామర్థ్యం 37 టీఎంసీలకు 17టీఎంసీలు ఉంది. ఈ రెండు జలాశయాలు నిండి దిగువకు నీళ్లు విడుదల చేస్తే తప్ప జూరాలకు కృష్ణాజలాలు చేరే అవకాశం లేదు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.68టీఎంసీల నీటి నిల్వ ఉంది.
వానాకాలం మొదలైనప్పటి నుంచి కేవలం 0.43 టీఎంసీల నీళ్లే జూరాలకు వచ్చాయి. గతేడాది ఇదే సమయానికి జూరాలలో 7.61 టీఎంసీల నీళ్లున్నాయి. ఎగువ నుంచి సైతం జూలై నాటికి వరద మొదలైంది. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎగువన వర్షపాతం లోపిస్తే దాని ఫలితం కచ్చితంగా దిగువ ఆధారిత ప్రాజెక్టులపై పడుతుంది. ప్రస్తుతం జూరాల నుంచి కేవలం కోయల్ సాగర్‌కు మాత్రమే 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు, భీమా పథకాలకు నీటి విడుదల మొదలుకాలేదు.
రైతన్నల ఆవేదన :జూరాల ప్రాజెక్టు సుమారు లక్ష ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. రెండు ప్రధాన కాలువల ద్వారా నీటి పారుదల సాగుతుంది. సాగునీటి కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానదీ ప్రాజెక్టులపై ఆధారపడ్డ రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నీళ్లొస్తే పంట.. లేకపోతే బీడేనని ఆవేదన చెందుతున్నారు. నైరుతి రాకతో కర్షకుల మదిలో ఆశలు చిగురించిన.. జూరాలకు నీటియద్దడి లేక నిరుత్సాహ పడుతున్నారు. జూరాల వెలవెలబోవడం వల్ల ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సామాన్యంగా ఆరుద్ర కార్తె నాటికి ఆయకట్టు కింద వరినార్లు పోసుకునే రైతులు ఈసారి నార్ల జోలికే వెళ్లలేదు. జూరాలలో నీళ్లు లేకపోవడం వల్ల బోరుబావులు, బావుల కింద మాత్రమే నార్లు పోస్తున్నారు. వేసిన నార్లు సైతం ఎండిపోయే పరిస్థితి వచ్చేలా ఉందని వాపోతున్నారు.