కరోనా కేసులు పెరిగినప్పుడు, టీకా నిల్వలు లేనప్పుడు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనం ఆ తర్వాత కనిపించలేదు. కొవిడ్ ప్రభావం తగ్గుతున్న కొద్దీ టీకా తీసుకోవడంపైనా జనంలో ఆసక్తి తగ్గింది. వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకా తీసుకోమని విజ్ఞప్తి చేసినా చాలామంది తిరస్కరిస్తూ వచ్చారు. మొదటి డోసు టీకా తీసుకున్నవారిలో ఎక్కువ మంది రెండో డోసు తీసుకోవడంపై నిరాసక్తత కనబరిచారు. ఫలితం 100శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయడంలో పాలమూరు జిల్లాలు వెనకబడ్డాయి. 18ఏళ్లు పైబడిన వాళ్లలో మొదటి డోసు 90శాతం మంది తీసుకుంటే, రెండో డోసు పూర్తైన వాళ్లు సగటున 25శాతం మందే. వ్యాక్సినేషన్‌లో వెనకబడిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం 5జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెలాఖరు లోపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15లక్షల డోసుల టీకాలివ్వడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. అనారోగ్యం బారిన పడతామన్న అపోహలు, కొన్నిసామాజిక వర్గాల్లో ఆచారం పేరిట నిరాకరణ, నిరక్షరాస్యత, అవగాహన లేమి, కొన్నిప్రాంతాల్లో వలసల కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సరిగా సాగలేదు.
టీకాలివ్వడంపైనే ప్రత్యేక దృష్టి
ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగమంతా టీకాలివ్వడంపైనే ప్రత్యేక దృష్టి సారించింది. ఉప కేంద్రం, గ్రామస్థాయిలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని ప్రతి ఒక్కరు టీకాలు తీసుకునే దిశగా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యారోగ్యశాఖ అధికారుల నుంచి కింది స్థాయి ఆశా కార్యకర్తల వరకూ పూర్తిస్తాయిలో టీకాలపై నిమగ్నమై ఉన్నారు. టీకాల్లో వెనకబడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల పరిధిలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ వ్యాక్సినేషన్ చేపడుతున్నారు. టీకా తీసుకోబోమని గతంలో తేల్చిచెప్పిన వారి జాబితాను ఆశా కార్యకర్తలు సిద్ధం చేసి ఉంచారు. వారే లక్ష్యంగా టీకాలు ఇస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రజా ప్రతినిధుల్ని సైతం భాగస్వాముల్ని చేస్తున్నారు. మొదటి డోసు తీసుకుని రెండో డోసు తీసుకోని జాబితా సైతం సిద్ధంగా ఉంది. వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించి టీకాలు వేస్తున్నారు. ఉపకేంద్రాల స్థాయిలో మొబిలైజేషన్ బృందం, వ్యాక్సినేషన్ బృందాలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ప్రత్యేకాధికారులను నియమించి రాత్రి వరకూ వాక్సినేషన్ పర్యవేక్షిస్తున్నారు.
కొవాగ్జిన్‌కు ప్రాధాన్యం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా మొదటి డోసులు కొవిషీల్డ్ తీసుకున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించినప్పుడు ఎక్కువమంది కొవిషీల్డ్ తీసుకున్నారు. వీరి రెండో డోసు గడువు 84రోజుల తర్వాత డిసెంబర్ రెండో వారం నుంచి ప్రారంభం కానుంది. దీంతో రెండో డోసు తీసుకునే వారి సంఖ్య డిసెంబర్ మాసంలో పెరిగే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్‌లో బాగా వెనకబడిన ప్రాంతాల్లో ఈసారి మొదటి డోస్ కోసం కొవాగ్జిన్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దానివల్ల 28 రోజుల్లో రెండో డోసు సైతం పూర్తై లక్ష్యం చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఒమిక్రాన్ నేపథ్యంలో..
ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జనం నుంచి కూడా వ్యాక్సినేషన్‌కు మంచి స్పందనే లభిస్తోంది. ప్రజలు సైతం టీకాలకు ముందుకు రావాలని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా మాస్కు ధరించడం తప్పనిసరని, గుంపులుగా చేరకూడదని, రెండు డోసుల టీకాలు తప్పనిసరి తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరం ఉంటే తప్ప జనబాహుళ్యంలోకి రావద్దని కోరుతున్నారు.