పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో సాగునీటి పనులు జరుగుతున్నాయని ఎన్జీటీకి సంయుక్త కమిటీ నివేదిక సమర్పించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు లేవని ఇటీవలే ఏపీ రైతులు ఎన్జీటీని ఆశ్రయించారు. నీటి కేటాయింపులే లేకుండానే ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇటీవలే ప్రాజెక్టును పరిశీలించిన కమిటీ నివేదికలో వెల్లడించింది.
కేవలం తాగునీటి కోసమే
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేవలం తాగునీటి కోసమేనని తెలంగాణ వాదనలు వినిపించింది. దీనిపై నిజ నిర్ధరణ కోసం గతంలో ఎన్జీటీ సంయుక్త కమిటీని నియమించింది. ఇటీవల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించిన సంయుక్త కమిటీ మధ్యంతర నివేదికను సమర్పించింది. తుది నివేదిక ఇచ్చేందుకు 8 వారాల గడువు కావాలని ఎన్జీటీని కోరింది.
ఏపీ. తెలంగాణ రైతులు పిటిషన్లు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని దీనిపై విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన చంద్రమౌళేశ్వర రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలానికి చెందిన కోస్గి వెంకటయ్య గ్రీన్ ట్రైబ్యునల్లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ట్రైబ్యునల్, వాస్తవ పరిస్థితులపై నివేదిక కోరుతూ వివిధ శాఖల నిపుణులతో సంయుక్త విచారణ కమిటీని నియమించింది.
ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు కమిటీ 15వ తేదీన నాగర్కర్నూల్ జిల్లాలో, 16న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించింది. రెండో రోజు పర్యటనలో భాగంగా కమిటీ సభ్యులు మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండలం కర్వేన జలాశయం 13వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన నమూనా చిత్రాలను తిలకించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి దృశ్య సమీక్ష నిర్వహించారు. జడ్చర్ల మండలం పరిధిలో నిర్మాణం చేస్తున్న ఉదండాపూర్ జలాశయం పనులను పరిశీలించారు. జడ్చర్ల, నవాబుపేట మండలాల నుంచి నల్లమట్టిని తరలించిన చెరువులను పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ చెరువులు నుంచి ఉండడంతో అధికారుల వద్ద కమిటీ సభ్యులు సమాచారం అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి:ngt team: ముగిసిన పర్యటన... నివేదిక ఇవ్వనున్న సంయుక్త విచారణ కమిటీ