మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. దేవరకద్ర పరిసర ప్రాంతాల్లో ఉదయం ఎనిమిది గంటల వరకు 52 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటిమట్టం గరిష్ఠ స్థాయి దాటడంతో రెండు గేట్లు పైకెత్తి.. 1600 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.
దేవరకద్రలో భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు - దేవరకద్రలో మోస్తరు నుంచి భారీ వర్షం
దేవరకద్ర నియోజకవర్గం అంతటా భారీ వర్షం కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి కోయిల్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరడంతో... రెండు గేట్లు పైకి ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.
దిగువన ఉన్న బండర్పల్లి వాగు, అనుబంధ వాగుల్లోని పెద్దవాగు, ఊక చెట్టు వాగు, దేవరకద్ర పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అడ్డాకుల మండలంలోని బలిదిపల్లి, వర్నే, ముత్యాలంపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గౌరీదేవిపల్లి, నెల్లికొండి సీతారాంపేట మధ్యనున్న వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దేవరకద్ర నియోజకవర్గంలో పత్తి, కంది పంటలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గం గుండా వెళ్తున్న 167వ జాతీయ రహదారిపై గుంతలు పడ్డాయి.
ఇదీ చూడండి:పొంగిపొర్లిన తాళ్లచెరువు... జల దిగ్బంధంలో వనపర్తి