అధికారుల నిర్లక్ష్యం... హరితహారానికి గ్రహణం రాష్ట్రంలో పర్యావరణాన్ని పెంపొందించేలా మొక్కలు నాటాలని ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టింది. కొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యం కారణంగా సర్కారు లక్ష్యాలు నెరవేరడం లేదు. వనపర్తి జిల్లాలోని 14 మండలాల్లో హరితహారంలో భాగంగా అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే అధికారులు చెబుతున్న లెక్కలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. కుంటుపడిన నర్సరీల నిర్వహణ
జిల్లాలో మొత్తం కోటి 20 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు రచించారు. దీనికి సంబంధించి ప్రతి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ కింద అటవీ శాఖ ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేశారు. అయితే మొక్కలు పెంచే ప్రక్రియపై దృష్టి సారించకపోవడం వల్ల వీటి నిర్వహణ కుంటుపడింది. జిల్లాలోని ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టిన అధికారులకు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీల ద్వారా కేవలం 5000 మొక్కలు మాత్రమే నాటేందుకు వీలుగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
నీరుగారుతోన్న లక్ష్యం..
అధికారుల పర్యవేక్షణా లోపం, వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. జిల్లా పరిధిలో ఇప్పటికే దాదాపు 10 లక్షల మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ కూలీలు గుంతలను సిద్ధం చేశారు. అయితే తగినన్ని మొక్కలు సిద్ధంగా లేకపోవడం వల్ల అవి నిరుపయోగంగా మారాయి.
లక్ష్యాన్ని సాధిస్తాం..
జిల్లాలో కోటీ 20 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రచించామని... వర్షాభావం కారణంగా నర్సరీలు నిర్వహించలేకపోతున్నామని అధికారులు తెలిపారు. మొక్కలు లేని చోట తిరిగి వాటిని నాటి అనుకున్న లక్ష్యాన్ని చేధిస్తామని అన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నా... అధికారుల పర్యవేక్షణా లోపం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నర్సరీలను రక్షించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
ఇదీ చూడండి : దుక్కి దున్నాలంటే ఎద్దులే కావాలా...?