రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుండటం వల్ల సాగు రంగానికి మంచి రోజులు వస్తున్నాయి. ఉద్యాన పంటలకు పెద్దపీట వేసిన సర్కారు పండ్లు, కూరగాయలు, పూల తోటల సాగుకు భారీగా ఇస్తున్న రాయితీలను రైతులు అందిపుచ్చుకుంటున్నారు. కరోనా వైరస్ విస్తృతితో రోగనిరోధక శక్తిని పెంపొందించే సిట్రస్ జాతి పండ్లతోపాటు ఇతర రకాల పౌష్టికాహార వినియోగంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దక్కన్ పీఠభూమి కావడం, అనుకూల వాతావరణం, నేలలు, ఇతర సాగు నీటి వనరుల సానుకూలతలతో రైతులు పండ్ల తోటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఖమ్మం, నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో పండ్ల తోటల సాగుతో అధికాదాయం పొందుతున్నారు.
కొందరు ఔత్సాహిక రైతులు పంజాబ్ నుంచి విత్తనాలు తీసుకొచ్చి కిన్నో ఆరెంజ్ సాగుకు శ్రీకారం చుట్టారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి మార్కెట్, గిరాకీ ఉన్న కిన్నో సాగుతో అధిక దిగుబడి సాధిస్తున్నారు. కొత్త బత్తాయి రకంగా గుర్తింపు పొందిన కిన్నో ఆరేంజ్ తోటల్లో మంగు, నల్లి, వేరుకుళ్లు వంటి సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. కొన్ని క్షేత్రాల్లో సేంద్రీయ పద్ధతుల్లో పండిస్తున్న దృష్ట్యా కొంత చీడపీడలు, తెగుళ్ల బెడద తక్కువగా ఉన్నప్పటికీ మార్కెటింగ్ ఇబ్బందులుంటున్నాయి.