మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ముఖ్య నేతల మాటున ప్రభుత్వ భూములు యథేచ్ఛగా అన్యాక్రాంతమవుతున్నాయి. గద్దల్లా అందినకాడికి తన్నుకుపోతున్నారు. మహబూబ్‌నగర్ అర్బన్ మండల పరిధిలో రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం మొత్తం 3,013 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. అందులో 988 ఎకరాలను పేదలకు అసైన్డు చేశారు. రెండేళ్ల కిందట ప్రభుత్వం భూముల శుద్ధీకరణ పథకాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలో మొత్తం 8,432 ఖాతాలను గుర్తించారు. అందులో 5,601 ఖాతాలకు డిజిటల్ సంతకాలయ్యాయి. మిగతావి వివాదాస్పద భూముల పేరుతో పక్కన పెట్టారు. కబ్జాలకు అవకాశమున్న భూములను పార్ట్- బిలో ఉంచినట్లు, కొన్ని సర్వే నంబర్లను అన్యాక్రాంతం చేయడంలో భాగంగానే డిజిటల్ సంతకాలు పెట్టకుండా ఆపుతున్నట్లు విమర్శలున్నాయి.
రోజూ ఫిర్యాదులు...
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, అసైన్డు భూముల కబ్జాలు రెవెన్యూ అధికారులకు తెలిసే జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. మహబూబ్‌నగర్ అర్బన్ కార్యాలయంలో తిష్టవేసిన కొందరు ఈ వ్యవహారాన్ని దగ్గరుండి నడిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ వ్యక్తుల వెనక ప్రముఖులుగా చెలామణి అవుతున్నవారు దస్త్రాలను మార్చడంలో కీలక భూమిక పోషిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో ఓ రెవెన్యూ కార్యాలయంలో బలమైన కొందరు నేతలు కొన్ని రోజులు అర్ధరాత్రి వరకు తిష్టవేసి దస్త్రాలను తారుమారు చేసినట్లు బహిరంగంగానే ఆరోపణలొచ్చాయి. మహబూబ్‌నగర్ పట్టణంలో రోజూ ఏదో ఓ ప్రాంతంలో భూమి అన్యాక్రాంతమైందని, కబ్జాలు చేస్తున్నారంటూ అధికారులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని 556, 607 సర్వే నంబర్లలో 371.34 ఎకరాల్లో ఐటీ పార్కును ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) నిర్ణయించింది. మొదట అధికారులు 481.06 ఎకరాల్లో ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రెవెన్యూ అధికారులు నిర్వహించిన డీజీపీఎస్ (డిఫరెన్సియేట్ గ్లోబల్ పొజిషనింగ్ సర్వే)లో 371.34 ఎకరాలు మాత్రమే స్థలమున్నట్లు గుర్తించారు. మరో 109 ఎకరాల స్థలం పొజిషన్‌లో లేదంటూ దానికి తగ్గట్టే అధికారులు గతేడాది పరిహారం అందించారు.
అప్పట్లో సర్వే నంబర్లలో భూములు తక్కువ చేసి చూపిస్తున్నారంటూ స్థానికులు షామియానాలు వేసుకొని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పాలకొండలోని ఒక సర్వే నంబరులో ఓ వ్యక్తికి 8.20 ఎకరాలుండగా.. 4.25 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు పాసుపుస్తకాలు ఇచ్చారు. మిగతా స్థలాన్ని ఓ ప్రముఖుడి పేర ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు దృష్టి సారించకుంటే ప్రభుత్వ భూములతోపాటు పేదలవీ అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ సర్వే నంబరు 79లో 76 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో కొంత భాగాన్ని భూమిలేని నిరుపేదలకు లావుణి పట్టాగా ఇచ్చారు. ఈ భూమిని అమ్మడానికి, కొనడానికి వీల్లేదు. అయినా ఇప్పటి వరకు నిబంధనలకు విరుద్ధంగా 852 రిజిస్ట్రేషన్లు చేశారు. పాలకొండ బైపాస్ రోడ్డుకు దగ్గరగా ఉండడంతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి.