ఆరుగాలం శ్రమించి పండించిన పంటచేతికొచ్చాక అకాల వర్షాలు నిండా ముంచుతాయేమోనన్న భయాలు రైతులను వెంటాడుతున్నాయి. ఓ వైపు అకాల వర్షాలు, వడగండ్ల వానలు మరోవైపు సకాలంలో కొనుగోళ్లు ధాన్యం సేకరణ కేంద్రాల్లో పేరుకు పోయిన రాశులతో యాసంగి వరి రైతులు బెంబేలెత్తి పోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యాసంగిలో 7లక్షల49 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని తొలత అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా 797 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం కొనుగోలు 634 కేంద్రాలు మాత్రమే తెరచుకున్నాయి. ఇప్పటి వరకూ లక్షా 67 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. మరో మూడున్నర లక్ష్ల లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా కేంద్రాల్లో సరైన వసతులు లేక రైతులు ఇబ్బందులకు గురవుతన్నారు.
వేధిస్తోన్న టార్పాలిన్ల కొరత:అన్నికేంద్రాల్లోనూ టార్ఫాలిన్ల కొరత వేధిస్తోంది. కేంద్రానికి 2 నుంచి 5 వరకూ మాత్రమే ఈసారి టార్ఫాలిన్లు అందించారు. ఇచ్చిన టార్పాలిన్లు గోనె సంచుల్ని కప్పేందుకే సరిపోతున్నాయని, రైతులకేమివ్వాలని కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు. టార్ఫాలిన్లు లేకపోవడంతో రైతులే సొంతగా కొనుగోలు చేసి ధాన్యాన్ని కాపాడుకుంటున్నారు. ఒక్కో టార్ఫాలిన్ ధర సైజును బట్టి రూ. 2 నుంచి రూ.3వేల వరకూ పలుకుతోంది. ఇది రైతులకు భారంగా మారుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ప్రభుత్వం సరఫరా చేసిన టార్ఫాలిన్లు రైతుల అవసరాలకు చాలడం లేదు. దీంతో అకాల వర్షాలకు చాలాచోట్ల ధాన్యం తడిసిపోతోంది.
టోకెన్ల జారీ జాప్యం: ధాన్యాన్ని అమ్ముకునేందుకు టోకెన్ల జారీలోనూ కొన్నిచోట్ల జాప్యం జరుగుతోంది. నాలుగైదు కేంద్రాలకు ఒక్కరే వ్యవసాయ విస్తరణాధికారి టోకెన్లు జారీ చేయాల్సిన చోట రైతులు సదరు అధికారికోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడవడం, రాత్రిళ్లు తేమశాతం పెరగడంతో మళ్లీ మళ్లీ ఆరబెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమశాతం పేరిట రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోంది. నిర్ణీత తేమశాతమున్న ధాన్యానికి ఎప్పటికప్పుడు టోకెన్లు జారీ చేస్తే పడిగాపులు పడాల్సిన అవసరం లేదని కోరుతున్నారు.