రైతులకు అండగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం.. mini mill for farmers: మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో బస్వరాజు, మల్లికార్జున్ అనే ఇద్దరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.. తక్కువ పెట్టుబడితో మినీ మిల్లును నెలకొల్పారు. ఇందులో వరి ధాన్యాన్ని మరాడించే చిన్న యంత్రం, పిండి, రవ్వ అందించే ఇసురాళ్లు, నూనె లేకుండా మరమరాలు తయారు చేసే యంత్రాలను ఏర్పాటు చేశారు. ఎకరా, రెండెకరాల్లో పండించిన ధాన్యాన్ని పెద్ద మిల్లుల్లో మరాడించేందుకు అంగీకరించరు. ఇక్కడున్న మినీ మిల్లులో.. 5 కిలోల నుంచి 2 టన్నుల వరకూ ధాన్యాన్ని మరాడించుకోవచ్చు. బియ్యం కాకుండా ధాన్యాన్నే మాగబెట్టి.. అవసరమైనప్పుడల్లా ఈ యంత్రంలో మరాడించవచ్చు.
సేంద్రీయ విధానంలో వరి పండించే వాళ్లు, దేశవాళీ రకాలైన నవారా, కాలాబట్టి, రక్తసాలి లాంటి వండగాలు పండించే వాళ్లకు ఎంతో ఉపయోగకరం. ఈ యంత్రంలో బియ్యాన్ని పాక్షికంగా పాలిష్ చేసే సదుపాయం ఉంది. 80 వేల విలువైన ఈ యంత్రం.. గంటకు 300 కిలోల బియ్యాన్ని మరాడిస్తుంది.
ఎకరా రెండెకరాల్లో చిరు ధాన్యాల్ని పండించే రైతుల పంటను.. ఆహారానికి అనుకూలంగా మార్చేందుకు మిల్లింగ్ యంత్రాలు ఎక్కడా లేవు. హన్వాడలో ఏర్పాటు చేసిన మినీ మిల్లులో.. లక్షా 80 వేలు విలువైన ఈ యంత్రంతో.. 5 కిలోల నుంచి 2 టన్నుల వరకూ మరాడించవచ్చు. కొర్రలు, సామలు, ఊదలు, సజ్జలు, రాగుల్లాంటి వాటిని వండుకునేందుకు వీలుగా మార్చవచ్చు. పాతవరి వంగడాలను పాలిష్ లేకుండా తినాలనుకునే వాళ్లు.. ఈ మిల్లులో మరాడించుకోవచ్చు.
నూనె లేకుండానే మరమరాల తయారీ..: పాత పద్ధతిలోనే పిండి, రవ్వను తయారు చేసే యంత్రాలు, బియ్యాన్ని దంచే యంత్రాలు, నూనె అవసరం లేకుండా మరమరాలు తయారు చేసే యంత్రాలు.. ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పల్లి, శనగ, బఠానీ, అటుకులు, పాపడాలు, చుడువ, మొక్కజొన్న పేలాలు, బొంగుపేలాల్ని.. నూనె లేకుండానే ఈ యంత్రం మరమరాలుగా తయారు చేస్తుంది.
ఆ ఉద్దేశంతోనే మినీ మిల్లు..: స్వయం ఉపాధితో పాటు.. రైతులు పండించిన పంటతో అనుబంధ ఉత్పత్తులను తయారు చేస్తే.. మరింత లాభాలు వస్తాయనే ఈ మినీ మిల్లును ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సన్నకారు రైతుల అవసరాలు తీర్చడంతో పాటు.. గ్రామాల్లో స్వయం ఉపాధి కోసం ఇలాంటి యంత్రాలు ఉపయోగకరంగా మారాయి.