Custom Milling Rice Issue In Joint Mahabubnagar District : ఉమ్మడి పాలమూరు జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట మిల్లర్ల అక్రమ దందాలు జోరుగా సాగుతున్నాయి. నిర్ణీత గడువులోగా ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇవ్వాల్సిన మిల్లర్లు, సీజన్లు దాటిపోతున్నా అప్పగించడం లేదు. సర్కార్ అప్పగించిన నాణ్యమైన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముకుని లాభాలు గడిస్తున్నారు. ఇటీవల వనపర్తి జిల్లాలో తనిఖీలు చేస్తే 14 మిల్లుల్లో 3 లక్షల బస్తాల ధాన్యం కనిపించలేదంటే, ఎంతగా పక్కదారి పడుతుందో తెలుసుకోవచ్చు. వీటి విలువ సుమారు రూ.24 కోట్లు ఉంటుందని అంచనా.
రూ.70 కోట్ల విలువైన సీఎంఆర్ పక్కదారి - మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబసభ్యుల ఇళ్లలో అధికారుల తనిఖీలు
గతేడాది నారాయణపేట జిల్లాలోని మూడు మిల్లుల్లో, ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లా అయిజలోని ఓ మిల్లులోనూ నిల్వలు లేకపోవటంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని మిల్లుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. అధికారులు వెంటపడితే తప్ప కస్టమ్ మిల్లింగ్ రైస్ (Custom Milling Rice) అప్పగించే పరిస్థితి కనిపించట్లేదు.
"వనపర్తి జిల్లాలో 40 శాతం సీఎంఆర్ ఇచ్చారు. రైస్ మిల్లర్లకు మిగతాది ఇవ్వాలని టార్గెట్లు ఇచ్చాం. రైస్ మిల్లులపై తనీఖీలు చేపడుతున్నాం. కస్టమ్ మిల్లింగ్ రైస్ ఒకవేళ పక్కదారి పటినట్లు గుర్తిస్తే సదరు మిల్లులపై చర్యలు తీసుకుంటాం." - తిరుపతి రావు, అదనపు కలెక్టర్, వనపర్తి జిల్లా
Custom Milling Rice Issue In Nagarkurnool District : నాగర్‌కర్నూల్ జిల్లాలో 2022-23 ఖరీఫ్‌కు సంబంధించి 92,000ల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 42,000ల మెట్రిక్ టన్నులు మాత్రమే అందింది. అంతకుముందు సీజన్లలోనూ సుమారు 11,421 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించని రెండు మిల్లులను డీఫాల్టర్లుగా గుర్తించారు. వనపర్తి జిల్లాలో 2021-22 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన బియ్యం ఇప్పటికీ అందలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.