ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 18 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటి వరకు తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 288కి చేరింది. అత్యధికంగా వనపర్తి జిల్లాలో 9 పాజిటివ్ కేసులు కాగా.. మహబూబ్‌నగర్ జిల్లాలో 6 మంది, నాగర్‌కర్నూల్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో నమోదైన ఆరు కేసులు పట్టణానికి చెందినవే కావడం గమనార్హం.
మహబూబ్‌నగర్‌లోని సుభాష్‌నగర్‌లో ఉండే ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్న తల్లీకూతుళ్లకు కరోనా సోకింది. టీడీగుట్టలో ఉండే మహిళ హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రాంనగర్‌లో ఓ మహిళకు కరోనా సోకింది. వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న ఆమె భర్తకు ఇదివరకే కరోనా పాజిటివ్ వచ్చి.. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. పద్మావతి కాలనీకి చెందిన మరో వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న సంజయ్‌నగర్‌లో ఉండే కానిస్టేబుల్ కరోనా బారిన పడ్డారు.