ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గుండా వెళ్లే ప్రధాన రైలు మార్గం కాచిగూడ- కర్నూల్. మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ మొదలుకొని జోగులాంబ గద్వాల జిల్లా జోగులాంబ హాల్ట్ వరకు ఈ మార్గంలో 15 రైల్వే స్టేషన్లున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు ఆ రైల్వేస్టేషన్లను తాకుతూ సుమారు 9 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 18 ప్యాసింజర్ రైళ్లు నడిచేవి.
ఖర్చు తక్కువ...
ఉమ్మడి జిల్లాలో వివిధ గ్రామాల్లో నివసిస్తూ, హైదరాబాద్, మహబూబ్‌నగర్, కర్నూల్ పట్టణాల్లో ప్రైవేటు ఉద్యోగాలు చేసేవాళ్లు, రోజువారీ కూలీలు, చిరువ్యాపారాలు నడిపే వాళ్లు నిత్యం ఈ రైళ్లలోనే ప్రయాణించే వాళ్లు. అలాంటి వాళ్ల సంఖ్య సుమారు పదివేలకు పైగానే ఉంటుందని అంచనా. బస్సు, ఇతర రవాణా మార్గాలున్నా... రైలు ప్రయాణానికే వాళ్లు మొగ్గుచూపేవాళ్లు.
కారణం, రైలు ప్రయాణానికయ్యే ఖర్చు చాలా తక్కువ. మహబూబ్‌నగర్ నుంచి హైదరబాద్‌కు నిత్యం ప్రయాణించేందుకు సీజన్ టిక్కెట్టు తీసుకుంటే నెలకు రూ. 600 ఖర్చయ్యేవి. కానీ బస్సు మార్గంలో వెళ్తే నెలకు రూ. 6వేలు ఖర్చవుతాయి. అందుకే రైలే వారి జీవనోపాధికి వారధిగా మారింది. 10 నెలలుగా రైళ్లు ఆగిపోయాయి. వారి ఉపాధి కూలిపోయింది.
ఉద్యోగాలే వదిలేసి...
సొంత గ్రామాల నుంచి హైదరాబాద్‌లాంటి పట్టణాలకు వెళ్లి పనిచేసే ప్రైవేటు ఉద్యోగులు, రోజువారీ కూలీలంతా కనిష్టంగా నెలకు రూ. 10వేలు, గరిష్ఠంగా రూ. 20వేల వరకూ సంపాదిస్తూ ఉంటారు. నిత్యం రైలు ఛార్జీలు రూ. 1,000 పోను వేతనం మిగిలేది. రైళ్లు ఆగిపోవడం వల్ల ప్రయాణ ఖర్చులే రూ. 6వేలకు మించి పోయాయి. ఇతర ఖర్చులు పోనూ... వేతనంలో మిగిలేదేమీ లేక ఎంతోమంది ఉద్యోగాలే మానేశారు.