తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీలో ఈటల.. ఆ ఇద్దరు నేతలను చేర్చుకునేలా హైకమాండ్​తో చర్చ - జూపల్లి కృష్ణారావు తాజా వార్తలు

BJP focus on BRS Suspension Leaders: బీఆర్​ఎస్​ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేతల భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్​లో చేరతారా... బీజేపీ కండువా కప్పుకుంటారా లేక... ఇతర నేతలతో కలిసి కొత్త పార్టీ వైపు అడుగులేస్తారా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీజేపీ ఆ ఇద్దరు నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే ఆ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ దిల్లీ వెళ్లి.. జాతీయ నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

bjp
bjp

By

Published : Apr 11, 2023, 5:04 PM IST

BJP focus on BRS Suspension Leaders : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బీఆర్​ఎస్​ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేతల భవిష్యత్ కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో బీఆర్​ఎస్ బహిష్కృత నేతలతో బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. మాజీ మంత్రి జూపల్లి, మాజీ ఎంపీ పొంగులేటిలను బీజేపీలో చేర్పించేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి డీకే అరుణ రంగంలోకి దిగారు.

దిల్లీలో ఈటల.. జాతీయ నేతలతో చేరికల అంశంపై చర్చ: మహబూబ్​నగర్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకి అదే జిల్లాకు చెందిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిన్న సాయంత్రం ఫోన్ చేశారు. కలిసి పనిచేద్దాం.. బీజేపీలో చేరాల్సిందిగా జూపల్లిని ఆహ్వానించారు. కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని జూపల్లి కృష్ణారావు చెప్పినట్లు సమాచారం. మరోవైపు జూపల్లి, పొంగులేటితో ఈటల రాజేందర్ టచ్​లో ఉన్నారు. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్​గా ఉన్న ఈటల రాజేందర్ హుటాహుటిన హస్తిన బాట పట్టారు. జాతీయ నేతలతో చేరికల అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఈటల దిల్లీలోనే మకాం వేయనున్నారు. ఎల్లుండి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారనీ ఈటల సన్నిహితులు చెబుతున్నారు.

ఆసక్తికరంగా జూపల్లి, పొంగులేటి తదుపరి అడుగు :మరోవైపు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్‌, బీజేపీ కండువాలు కప్పుకుంటారా లేక ఇతర నేతలతో కలిసి కొత్త పార్టీ వైపు అడుగులేస్తారా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అనుచరులు, తమ వెంట ఉన్న పార్టీ నేతలతో కలిసి చర్చించి తదుపరి నిర్ణయానికి రావాలని ఇరువురు నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జూపల్లి, పొంగులేటి తీసుకోనున్న నిర్ణయంపై తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా సహా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన సీనియర్ రాజకీయ నాయకుడు జూపల్లి కృష్ణారావు... తదుపరి అడుగు ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గట్టి పట్టున్న పొంగులేటి ఏ పార్టీ వైపు చూస్తారన్నదానిపై ఉత్కంఠ వీడటం లేదు.

ఆ 14 స్థానాలు బీఆర్​ఎస్ వ్యతిరేక శక్తులే గెలుస్తాయి : ఇదిలా ఉండగా పార్టీ సస్పెన్షన్ వేటు అనంతరం తొలిసారి నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు వచ్చిన జూపల్లి కృష్ణారావు... అనుచరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జూపల్లి.. వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 14 స్థానాలు బీఆర్​ఎస్ వ్యతిరేక శక్తులే గెలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్ తనపై చేసిన విమర్శల్ని జూపల్లి కృష్ణారావు తిప్పికొట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details