Massive Irregularities in Dalit bandhu Scheme: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న దళిత బంధు పథకం క్షేత్రస్థాయిలో అభాసుపాలు అవుతోంది. నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. మండలానికి 1708 యూనిట్లు మంజూరుకాగా.. ఇప్పటివరకి 1601 యూనిట్లు లబ్దిదారులకు చేరాయి.
రూ.10 లక్షలు విలువైన యూనిట్లు లబ్దిదారులకు అందాల్సి ఉండగా.. వారికి 7 నుంచి రూ.8 లక్షలు విలువైన వస్తువులు మాత్రమే చేతికి అందుతున్నాయి. చారగొండలో రూ.10 లక్షల విలువైన యూనిట్‌కు జీఎస్టీ 18 శాతం, రవాణా 20 వేలు, కమిషన్ కింద కొంత మొత్తం మినహాయించుకొని మిగిలిన డబ్బులకే యూనిట్లు మంజూరు చేశారని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరల కంటే అధిక ధరకు పనిముట్లు, సరుకులిచ్చారని, వాటిని అమ్ముకోలేక పోతున్నామని వాపోతున్నారు.
ఏజెన్సీలు ఇష్టానుసారం దోపిడికి పాల్పడుతున్నాయి: మంజూరైన డబ్బుకు యూనిట్లు ఇవ్వాల్సిన ఏజెన్సీలు ఇష్టానుసారం దోపిడికి పాల్పడుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. దళితబంధు కోసం మంజూరైన డబ్బులు లబ్దిదారు ఖాతా నుంచి యూనిట్ అమ్మిన సంస్థకే జమకావాలి. కానీ.. ఓ తండా సర్పంచి తల్లి బ్యాంకు ఖాతాలోకి ఏడుగురి లబ్దిదారుల డబ్బులు జమయ్యాయి. సర్పంచి మేనేత్త కుమారుడి ఖాతాలోకి ఐదుగురి డబ్బులు వెళ్లాయి.