ఖండాతర ప్రేమ: అమెరికా అబ్బాయి... పాలమూరు అమ్మాయి అమెరికా అబ్బాయి... పాలమూరు అమ్మాయి ఏడు అడుగులు, మూడు ముళ్లతో ఒకటయ్యారు. మహబూబ్‌నగర్‌కు చెందిన వర్షిణి, అమెరికాలోని డల్లాస్‌కు చెందిన హెన్రిహుడ్గిన్స్ల వివాహం హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది.
ఉద్యోగమే కలిపింది...
హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసిన వర్షిణి... ఎంఎస్ చేసేందుకు నాలుగేళ్ల కిందట అమెరికాకు వెళ్లింది. చదువు పూర్తికాగానే... డల్లాస్‌లోని క్యాపిటల్ ఒన్ సంస్థలో జూనియర్ సాప్ట్‌వేర్‌గా చేరింది వర్షిణి. అదేసంస్థలో సీనియర్ సాప్ట్‌వేర్‌గా పనిచేస్తున్న హెన్రి హుడ్ గిన్స్‌తో స్నేహం ఏర్పడింది. ఒక్కరికొకరు నచ్చటం వల్ల స్నేహం కాస్తా... ప్రేమగా చిగురించింది.
కుటుంబాల అంగీకారంతో...
కొన్నిరోజుల ప్రేమాయణం తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట... ఇరు కుటుంబాలను ఒప్పించేందుకు ఏడాదికాలంగా ప్రయత్నిస్తూ వచ్చారు. నానా తంటాలు పడి చివరకు ఇద్దరి కుటుంబాలను ఒప్పించారు ఈ ప్రేమ పక్షులు. హిందూ సంప్రదాయం ప్రకారం హైదరాబాద్‌లో పెళ్లి జరిగేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
పెళ్లిపెద్దగా మంత్రి శ్రీనివాస్ గౌడ్...
పెళ్లి కుమారుడు హెన్రి తరఫున తల్లి, సోదరుడు హాజరుకాగా... వర్షిణి తరుఫున చిన్నాన్న, చిన్నమ్మలతోపాటు దగ్గర బంధువులు హాజరయ్యారు. ఇవాళ 11.15 గంటలకు బేగంపేట టూరిజం ప్లాజాలో వారిద్దరి వివాహం జరిగింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్... పెళ్లిపెద్దగా దగ్గర ఉండి వివాహం జరిపించారు. సుఖసంతోషాలతో కలిసుండాలని వధూవరులను మంత్రి ఆశీర్వదించారు.
ఇవీ చూడండి: ఫంక్షన్‌హాల్‌లో కూలిన గోడ... నలుగురు మృతి