పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను ఆంధ్రప్రదేశ్ దోచుకుపోతుందని తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు వివరించాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కూమార్ డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్‌తో ఉన్న చీకటి ఒప్పందం వల్లే.. కృష్ణా నీటిని తరలించుకుపోతున్నా స్పందించడం లేదని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దక్షిణ తెలంగాణపై తెరాస ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందని ఆరోపించారు.
పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం రోజు లక్ష క్యూసెక్కుల నీరు తోడుకుపోతే.. పాలమూరు ఏడారవుతుందని సంపత్ కుమార్ ధ్వజమెత్తారు. 12 లక్షల 30వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆరోపించారు.