తెలంగాణ

telangana

By

Published : Jul 28, 2020, 2:22 PM IST

ETV Bharat / state

మీ రక్షణార్థం నన్ను తప్పక ధరించండి: మాస్క్

మిత్రులారా.. ఎలా ఉన్నారు.. ఆరోగ్యం ఎలా ఉంది.. ఇంతకు నేనెవరో తెలుసా.. నా పేరు మాస్క్‌.. కొవిడ్‌-19 బారిన పడకుండా మీరందరూ నన్ను వినియోగిస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు చేరువయ్యా. ప్రస్తుత పరిస్థితుల్లో నా అవసరం ఎంతో ఉంది. అందుకే కొన్ని మంచి మాటలు చెబుదామని మీ ముందుకు వచ్చాను..

మీ రక్షణార్థం నన్ను తప్పక ధరించండి: మాస్క్
మీ రక్షణార్థం నన్ను తప్పక ధరించండి: మాస్క్

దగ్గినా.. తుమ్మినా..: వారి నోటి నుంచి వెలువడే తుంపర్లలో కంటికి కనిపించని వైరస్‌ని మీ దరి చేరనివ్వకుండా అడ్డుకుంటుంది నేనే. ఒక విధంగా చెప్పాలంటే.. దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల మాదిరిగా నేను మీకు, వైరస్‌కు మధ్య రక్షక కవచంలా పోరాటం చేస్తున్నా. నన్ను దాటి మీ శరీరంలోకి ఏ విధమైన సూక్ష్మ క్రిమిని చేరనివ్వను. నేనంటే జనంలో అంత భరోసా పెరిగింది మరి.

మీ సంరక్షణ బాధ్యత నాదే:

ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తున్న కరోనా.. కోరలు చాచిన విష నాగులా తిరుగుతోంది. మీ రక్షణార్థం నన్ను తప్పక ధరించండి. నిర్లక్ష్యం చేయకండి. రెప్పపాటు సమయంలో ఆదమరిచి నన్ను మరిస్తే వైరస్‌ మీ శ్వాస కోశాలకు చేరి ఊపిరి తిత్తులపై దాడి చేస్తుంది. ఊపిరి ఆడకపోతే పరిస్థితి ఏమిటనేది నేను మీకు ప్రత్యేకించి విడమరిచి చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఇలాంటి భయానక జీవనం నడుమ మీ వెన్నంటే ఉండి రక్షిస్తున్నా! రక్షిస్తా!! అందరిలో సామాజిక చైతన్యం నింపా. వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ను వేదిక చేసుకుని అవగాహన కల్పించా. కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ.. కరోనాను తరిమికొట్టండి..

ధరించకపోతే జరిమానా:

అన్నట్లు.. మీకో విషయం చెప్పడం మరిచా. ధరించకపోతే వైరస్‌ బారిన పడటం ఒక ఎత్తు. మరో పక్క మీ క్షేమాన్ని దృష్టి పెట్టుకుని పోలీసులు, మున్సిపల్‌ అధికారులు, పంచాయతీ సిబ్బంది, కార్పొరేషన్‌ యంత్రాంగం జరిమానా విధిస్తారు. ఖజానా నింపేసుకోవడానికి మీ దగ్గర ఏదో వసూలు చేయాలని కాదు. మీ బాధ్యతను మీకు గుర్తు చేయాలన్నదే ఈ తలంపు ముఖ్యోద్దేశం.

నాకందరూ సమానులే:

ఆడా మగా, చిన్నా పెద్దా, ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా చూస్తున్నా. నేను లేకపోతే మీరు అడుగు తీసి అడుగు బయటకు పెట్టలేరు. మీకు తోడుగా నేనున్నాననే ధీమాతోనే మీ దైనందిన పనులను చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. మొదట్లో ప్రభుత్వమే నన్ను మీ దగ్గరకు చేరవేసింది. ఆ తర్వాత స్పందించిన కొంత మంది దాతల పుణ్యమా?అని మీ వద్దకు వచ్చాను. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వివిధ రూపాల్లో లభ్యమవుతున్నా.

*● ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు అనుసరించి మీరు కొన్ని ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. మెడికల్‌, క్లాత్‌తో తయారు చేసినవేవైనా ఉపయోగించవచ్చు. మెడికల్‌వి ఒకసారి వాడి పారేయాలి. క్లాత్‌వి అయితే ఎన్ని సార్లయినా వినియోగించుకునే వీలుంది.

● రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లాల్సి రావడం అనివార్యమైతే నన్ను తప్పక ధరించాలి.

*● ఆసుపత్రి లోపలికి వెళ్లినప్పుడు ధరించే వాటిని బయటకు వచ్చాక పడేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండోసారి వాడకూడదు.

*● మీ ఇంట్లో వృద్ధులుంటే వారికి మెడికల్‌వే ఇవ్వండి. అనారోగ్యంతో బాధ పడే వారికి సైతం ఇవే సమకూర్చండి.

*● క్లాత్‌తో తయారు చేసుకుంటే నాలుగైదు పొరలుండేలా చూసుకోండి.

*● కొవిడ్‌ లక్షణాలు లేని వారు ఫ్యాబ్రిక్‌వి వాడాలి. ఊపిరి పీల్చుకోవడానికి వీలుండేలా ధరించండి.

ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ABOUT THE AUTHOR

...view details