ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటకు కట్టుబడి పోడురైతులకు పట్టాలివ్వాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. మహాబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో పోడు భూముల పరిరక్షణ కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గిరిజన రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌కు, అటవీ శాఖ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.
పోడుభూముల సమస్యలను నియోజకవర్గాల్లో కుర్చీవేసుకుని కూర్చుని పరిష్కరిస్తానన్న ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఆ సమస్యను పట్టించుకున్న పాపానపోలేదని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పినా అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడం చూస్తుంటే 'ముఖ్యమంత్రి కంట్రోల్లో అటవీశాఖ ఉందో? లేక అటవీశాఖ కంట్రోల్లో ముఖ్యమంత్రి ఉన్నారో' అర్ధంకావడం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోడుభూములకు పట్టాలిస్తే.. తెరాస ప్రభుత్వం హరితహారం పేరుతో ఆ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇకనైనా పోడురైతులపై దాడులను ఆపి ఆ పోడు భూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.