Clash in Trs Leaders: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో అధికార తెరాసలో ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ నిధులను సర్పంచ్ దుర్వినియోగం చేశారంటూ పీఎసీఎస్ వైస్ ఛైర్మన్ మహేశ్ వర్గానికి చెందిన వారు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగాగత కొన్ని నెలల నుంచి సక్రమంగా గ్రామ సభలు నిర్వహించడం లేదని, గ్రామాభివృద్ధి నిధుల వివరాలు చెప్పడం లేదంటూ అందులో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సర్పంచ్ శ్రీనివాస్ నిధుల దుర్వినియోగం జరగలేదంటూ.. అవినీతి జరిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఈ క్రమంలో మహేష్ వర్గం జీపీ నిధులు అవకతవకలు నిరూపిస్తామంటూ చర్చకు రావడంతో ఇరు వర్గాల మధ్య గొడవ తలెత్తింది. ఒక్కసారిగా ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో గ్రామస్థులు వారికి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలో తమపై సర్పంచ్ వర్గం వారు దాడిచేశారని మహేశ్ వర్గం ఆరోపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీశారు. ఈ రెండు వర్గాల వారు అధికార పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం.