మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. నాలుగు జిల్లాల్లో విస్తరించిన మహబూబాబాద్‌లో ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత, కాంగ్రెస్ తరఫున మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్, భాజపా అభ్యర్థిగా హుస్సేన్ నాయక్ బరిలో ఉన్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు.
వినయ విధేయ కవిత
అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో 4స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. ఎలాగైనా ఎంపీ సీటు గెలుచుకోవాలనే పట్టుదలతో కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీ బలోపేతానికి తీవ్ర కసరత్తే చేశారు. ఫలితంగా ఇల్లందు, పినపాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసకు జైకొట్టారు. అభ్యర్థి ఎంపిక కోసం నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఫలు దఫాలు చర్చలు జరిపి సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్‌ను కాదని మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవితకు టికెట్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు, సీనియర్ నాయకుడు రెడ్యానాయక్ కుమార్తెగా, సౌమ్యురాలిగా, అందరికీ అందుబాటులో ఉండే తత్వం కవితకు కలిసొస్తాయని ధీమాతో ఉన్నారు. సమన్వయంతో పనిచేసి భారీ మెజార్టీ సాధించాలని కేసీఆర్ ఇప్పటికే శ్రేణులకు స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే ముఖ్యమంత్రి సభతో కార్యకర్తల్లో జోష్ నింపి పక్కా ప్రణాళికతో పనిచేస్తే ఘన విజయం సాధించొచ్చని భావిస్తున్నారు.
'సంప్రదాయం'పైనే హస్తం ధీమా