Dharani Portal Problems : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నారాయణపురంగ్రామంలోని రైతులకు భూ దస్త్రాల ప్రక్షాళనతో కొత్త సమస్య తలెత్తింది. వారు సాగుచేసుకుంటున్న భూములన్ని రెవెన్యూశాఖ నిర్వహించిన భూదస్త్రాల ప్రక్షాళనలో అటవీశాఖవని చూపాయి. దీంతో ఆరేళ్లుగా అక్కడి వారికి పాసుపుస్తకాలివ్వలేదు. గత నెలలో గ్రామమంతా నిరాహారదీక్ష చేయడంతో సర్వే చేసి ధరణిలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. తీరా మీసేవా కేంద్రానికి వెళ్తే ఐచ్ఛికాలు లేవని చెబుతున్నారు. భూముల స్వభావం అనే కాలమ్ వద్ద అడవి అని చూపిస్తోందని వారు వాపోతున్నారు.
ఆరేళ్ల క్రితం వరకు అక్కడి రైతులకు పాసుపుస్తకాలున్నాయి. రెవెన్యూశాఖ నిర్వహించిన భూదస్త్రాల ప్రక్షాళనలో ఒక్కసారిగా ఆ ఊరి భూములన్నీ అటవీశాఖవని చూపాయి. ఇక అప్పటి నుంచి వారి వేదన అరణ్య రోదనైంది. ఇన్నేళ్లు వారు తిరగని కార్యాలయం లేదు. వానాకాలం సీజను వస్తోంది. ఈ విడతైనా రైతుబంధు సాయం వచ్చేలా పాసుపుస్తకాలు అందుతాయో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అనేక జిల్లాల్లో బాధితులు: రాష్ట్రంలో కొత్తపాసుపుస్తకాల జారీ ప్రక్రియ ప్రారంభించాక రెవెన్యూశాఖ అన్నిరకాల సమస్యల పరిష్కారంపై సరైన దృష్టిసారించలేదు. దీంతో అనేక జిల్లాల్లో హక్కులు అందని బాధితులున్నారు.
- మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం నారాయణపురం గ్రామం మొత్తం హక్కులకు దూరంగా ఉంది. గ్రామంలో 2,669 ఎకరాలుండగా కొంత భూమికి హక్కుల విషయంలో స్పష్టత లేదన్న ఆరోపణలున్నాయి. అటవీ-రెవెన్యూశాఖల మధ్య కూడా హక్కుల సమస్య ఉంది. దీనిపై చివరికి అటవీశాఖ స్పష్టత ఇచ్చినా రైతులకు భూములపై హక్కులు దక్కని పరిస్థితి నెలకొంది. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సర్వే చేసి 1,403 ఎకరాలకు పాసుపుస్తకాల జారీకి స్పష్టత ఇచ్చినా ధరణిలో ఐచ్ఛికాలు లేక హక్కులు దక్కలేదు. కొందరికి మాత్రం దస్త్రాల్లోని సర్వే నంబర్లు ఒక చోట, ప్రస్తుత సర్వేలో ఉన్నది మరోచోట అని చూపుతుండటం కూడా సమస్యగా మారింది.
- ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలోనూ రెండు గ్రామాల ప్రజలు అవస్థ పడుతున్నారు. కన్నాయిగూడెంలో అటవీ-రెవెన్యూ సమస్యతో ఇప్పటికీ హక్కులు కల్పించలేదు. గ్రామస్థులు సాగు చేసుకుంటున్నది రెవెన్యూ భూమి అని స్పష్టత వచ్చినప్పటికీ పాసుపుస్తకాలు జారీ కాలేదు. రామన్నగూడెంకు చెందిన 70 మంది రైతుల చేతుల్లో పాత ఎసైన్డ్ హక్కు పత్రాలున్నాయి. అటవీశాఖ మాత్రం తమ భూమి అని రైతులను రానివ్వడం లేదు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలోనూ 250 మంది రైతులకు పాసుపుస్తకాలు అందలేదు. చాలా మంది ఖాతాలు, సర్వే నంబర్లు పోర్టల్లో కనిపించడం లేదు. రైతులంతా సాగులోనే ఉన్నప్పటికీ హక్కులు లేవు.
కాలం గడుస్తున్నా పరిష్కారం లేదు:ధరణి పోర్టల్లో సరైన ఐచ్ఛికాలు లేక గ్రామాల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇప్పటి వరకు 32 రకాల మాడ్యూళ్లు ఉన్నప్పటికీ కీలకమైనవి అందుబాటులోకి తేవడం లేదు. గ్రీవెన్స్ ల్యాండ్ మ్యాటర్స్ పేరుతో ఇచ్చిన ఐచ్ఛికానికి దరఖాస్తు చేసుకున్నా పరిష్కారం లభించడం లేదని బాధితులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టితో సమస్యలకు సంబంధించిన ఐచ్ఛికాలు విడుదల చేయాలని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ)కు రాస్తే తప్ప మరో మార్గం లేదని సీనియర్ అధికారులు సూచిస్తున్నారు. ఇనాం భూములకు హక్కులు కల్పించేందుకు ఇటీవల రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సీసీఎల్‌ఏ ప్రత్యేకంగా ఐచ్ఛికాలు విడుదల చేసిందని.. ఇతర జిల్లాల నుంచి విజ్ఞప్తులు వస్తే ఐచ్ఛికాల జారీ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని రెవెన్యూశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు.