మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ఘరానా మోసం బట్టబయలైంది. తక్కువ వడ్డీకే రుణాలిస్తామని నమ్మబలికి 10 తండాల ప్రజల నెత్తిన శఠగోపం పెట్టారు. విజయవాడకు చెందిన విజయదుర్గా హోమ్నీడ్స్ ఫైనాన్స్ సంస్థ పేరుతో కొందరు అమాయక గిరిజనుల్ని మోసం చేశారు.
రూపాయి వడ్డీకే 50వేలు.. బయటపడ్డ ఘరానా మోసం అసలేం జరిగిందంటే....
ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు ద్విచక్రవాహనం, ఇన్నోవా వాహనంలో దర్జాగా సూటు బూటు వేసుకుని తండాలకు వెళ్లారు. అమాయక గిరిజనులకు రూపాయి వడ్డీకే 50 వేల అప్పు ఇస్తామని... నెలనెలా 2 వేల 500 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు.
మోసపోయిన 10 తండాల ప్రజలు
10 మంది కలిసి ఒక్కో గ్రూపుగా ఏర్పడి కొంత మంది బంగారం అమ్ముకుని, మరికొంత మంది భూమిని అమ్ముకుని 3 వాయిదాల చొప్పున ఒక్కొక్కరు 2 వేల 800 రూపాయలు చెల్లించారు. అందులో కొంతమందికి రైస్ కుక్కర్ ఇచ్చి మభ్యపెట్టారు. ఈ నెల 26న 50 వేలు ఇస్తామని నమ్మించారు. సాయంత్రం వరకు ఎదురుచూసినా సంస్థ ప్రతినిధులు రాకపోలేదు. కార్యాలయానికి వెళ్లి చూస్తే తాళం వేసి ఉందని, ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 10 తండాల ప్రజలు మోసపోయినట్లు తెలుస్తోంది.
కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రతినిత్యం మోసాలు జరుగుతున్నా ఇంకా అమాయక ప్రజలు మోసగాళ్ల మాటలను నమ్ముతూనే ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకొని, మోసాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదీ చూడండి:పాక్ నిలవాలంటే భారత్ గెలిచి తీరాల్సిందే!