భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బంజరతండా వద్ద మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గార్ల మండల కేంద్రం శివారులో పొంగి ప్రవహిస్తున్న పాకాల వాగులను రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందుతో కలిసి పరిశీలించారు. పాకాల వాగు ఉద్ధృత ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయిన రాంపురం, మద్దివంచ గ్రామాల్లో ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలకు తరలించి, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
మంత్రి ఆదేశాలతో వారికి అన్ని వసతులను కల్పించారు. కేంద్రంలో నిరాశ్రయులకు బియ్యం, నిత్యావసర సరుకులను మంత్రి సత్యవతి పంపిణీ చేశారు. వర్షాలు తగ్గే వరకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని, ధైర్యంగా ఉండాలని బాధితులకు భరోసా కల్పించారు. పాకల చెక్ డ్యామ్ ఎత్తు పెంచి రాంపురం... మద్దివంచ గ్రామాల ప్రజల ఇబ్బందులను తీర్చాలని ప్రజలు మంత్రికి విన్నవించారు.