మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలకు డోర్నకల్‌లోని మున్నేరు, నరసింహులపేట, చిన్నగూడూరు మండలాల్లోని ఆకేరు, దంతాలపల్లి మండలంలోని పాలేరు వాగులకు వరద ఉధృతి కొనసాగుతోంది.
వాగులపై నిర్మించిన చెక్ డ్యాంలు నిండి వరద నీరు పరుగులు పెడుతోంది. దంతాలపల్లి మండలం పెద్దముప్పారం శివారులోని పాలేరు వాగులో లెవల్ బ్రిడ్జి పైనుంచి మూడు అడుగులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పెద్ద ముప్పారం గ్రామం నుంచి దంతాలపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహిళలు వరద నీటిలో పసుపు కుంకుమ వేసి పూజలు నిర్వహించారు.
అన్ని గ్రామాల్లోని చెరువులు నిండి మత్తళ్లు పోస్తున్నాయి. మత్తళ్ల వద్ద చేపలు పట్టేందుకు వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వర్షాలకు వరి పంటలు నీట మునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి, పెసర పంటలకు తీరని నష్టం వాటిల్లింది.