మహబూబాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఆడపిల్లల అక్రమ దత్తతపై అధికారులు దృష్టి సారించారు. మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుడితే అక్రమంగా దత్తత ఇస్తున్నట్లు గుర్తించారు. ఇలా ముగ్గురు, ఆపై సంతానం కోసం ప్రసవానికి వచ్చే వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
పోషించే స్తోమత లేక
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామోజీ తండాకు చెందిన గుగులోత్ మంజుల అనే మహిళ... వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించింది. అప్పటికే ఇద్దరు అమ్మాయిలు ఉండగా మూడో సంతానంలోనూ ఆడపిల్లే పుట్టింది. పాపను పోషించే స్తోమత లేక దత్తత ఇచ్చామని పాప తల్లి తెలిపారు.
స్థానికుల చందాలు
అక్రమ దత్తతతో తండాకు చెడ్డపేరు తీసుకురావద్దంటూ స్థానికులు చందాలు సేకరించారు. తల్లిదండ్రులకు కొంత సాయం చేస్తే పాపను బాగా చూసుకుంటారన్న ఉద్దేశంతో లక్ష రూపాయలు పోగు చేశారు. దత్తత ఇచ్చిన పాపను స్వగ్రామానికి తీసుకువచ్చి తల్లి ఒడికి చేర్చారు. అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఆడపిల్ల పుట్టగానే అక్రమ దత్తత ఇస్తున్నారని తండావాసులు ఆరోపిస్తున్నారు.