మహబూబాబాద్ జిల్లాలోని ఓ గిరిజన తండాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వేడుకలో ఏర్పడిన పరిచయం కాస్తా... సామూహిక అత్యాచారానికి దారితీసింది. అమనగల్ శివారులోని ఓ తండాకు చెందిన 16 ఏళ్ల బాలుడు వేడుకల్లో కేటరింగ్ పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో జరుగుతున్న ఓ కార్యక్రమానికి వచ్చింది. అదే వేడుకకు క్యాటరింగ్ చేస్తున్న బాలునితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఫోన్ నంబర్లు తీసుకుని మాట్లాడుకోసాగారు. చనువు పెరగటం వల్ల తన ఇంటికి రావాలని యువతిని బాలుడు ఆహ్వానించాడు.
నమ్మించి.. తోటకు తీసుకెళ్లి...
ఇంటికి వచ్చేందుకు ఒప్పుకున్న యువతి శుక్రవారం రోజున సికింద్రాబాద్ నుంచి గోల్కొండ రైలులో మహబూబాబాద్‌కు వచ్చింది. ఆటోలో తండాకు చేరుకుంది. బాలున్ని కలుసుకోగా... ఏవో మాయమాటలు చెప్పి మామిడి తోటకు తీసుకెళ్లాడు. తండాకు చెందిన ఇద్దరు, మహబూబాబాద్‌కు చెందిన మరో ఇద్దరు, తొర్రూరుకు చెందిన ఓ బాలుడు కలిసి పథకం ప్రకారం యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.