తెలంగాణ

telangana

ETV Bharat / state

ముప్పుతిప్పలు పెడుతున్న పులి.. పట్టుకోవాలంటే భారీగానే చెల్లించాలి! - telangana forest officers

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మూణ్నెళ్ల నుంచి అటవీ అధికారులను ఏ2 పులి ముప్పుతిప్పలు పెడుతోంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన దీన్ని పట్టుకోవడానికి అధికారులు బాగానే ఖర్చు పెడుతున్నారు. ఇప్పటి వరకు రూ.25 లక్షలు ఖర్చు చేశారు. మరో రూ.55 లక్షల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

telangana-forest-officers-fund-proposal-to-government-to-catch-a2-tiger
ఏ2 పులిని పట్టుకునేందుకు భారీ ఖర్చు

By

Published : Feb 12, 2021, 1:15 PM IST

మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నుంచి గత నవంబర్​లో కుమురం భీం జిల్లా అటవీ ప్రాంతానికి ఓ పులి వచ్చింది. ఇక్కడే సంచరిస్తూ ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తుల్ని, 32 పశువులను హతమార్చింది. ఈ పులిని పట్టుకోవడానికి అధికారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఖర్చు కూడా భారీగానే పెడుతున్నారు. మృతి చెందిన పశువులకు సగటున 15 వేల నుంచి 20 వేల రూపాయల వరకు అధికారులు పరిహారం చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ.5 లక్షలు పరిహారాన్ని సంబంధిత రైతులకు అందించారు.

అలా బ్రేక్ పడింది..

పులి దాడిలో చనిపోయిన ఇద్దరి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇచ్చారు. జనవరి 11న బెజ్జూర్ మండలంలోని అటవీ ప్రాంతంలో ఈ పులికి మత్తు మందు ఇచ్చి బంధించే ప్రక్రియ జరిగింది. దీనికోసం అధికారులు రూ.10 లక్షలు ఖర్చు చేశారు. 150 మంది అధికారులు ఈ ఆపరేషన్​లో పాల్గొనగా.. ఏ2 పులి మహారాష్ట్రకు తరలిపోవడం వల్ల ఈ ఆపరేషన్​కు బ్రేక్ పడింది.

వేసవిలో ఆపరేషన్

మహారాష్ట్ర నుంచి తిరిగి వచ్చిన పులి ప్రస్తుతం ప్రాణహిత, పెద్దవాగు సంగమించే ప్రదేశంలో సంచరిస్తూ వాగు పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు తరచూ కనిపిస్తోంది. ప్రజలు నిరంతరం భయాందోళనల్లో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ2 పులి ఆపరేషన్ ఈ వేసవిలో కొనసాగించడానికి అటవీశాఖ అధికారులు రూ.55 లక్షల కోసం రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. అవి విడుదలైన వెంటనే ఆపరేషన్ ప్రారంభిస్తామని, ప్రస్తుతం ప్రాణహిత సమీపంలోనే మత్తుమందు ప్రయోగించడానికి వేచి చూస్తున్నామని పేర్కొన్నారు.

అక్కడే పుట్టింది..

మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలోని దుర్గాపూర్ సమీపంలో ఉపరితల బొగ్గు గనులు, థర్మల్ పవర్ ప్లాంట్ ఆధ్వర్యంలో 25 హెక్టార్లలో అడవిని పెంచారు. అది ప్రస్తుతం దట్టమైన వనంగా మారింది. ఆ వనంలోనే ఏ2 పులి జన్మించి రాజురా మీదుగా ఆసిఫాబాద్ అడవులకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పులి వయస్సు నాలుగేళ్లు. చంద్రాపూర్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ పులిని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మత్తుమందు ప్రయోగం ద్వారా బంధించాలని ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details