వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోయిన ఆదివాసీలకు తిర్యాని పోలీసులు కృత్రిమ కాళ్లను అందించి ఉదారత చాటుకున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల మండలం తిర్యానిలోని అటవీ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు మూఢనమ్మకాలు, ప్రమాదాలతో కాళ్లు కోల్పోయారు. మంచానికే పరిమితమై భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి వారికి ఆపద్బాంధవుడిగా ఎస్సై రామారావు చేయూతనిచ్చారు.
తిర్యాని మండలం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పుప్పాల రామారావు ఆది నుంచి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మారుమూల గ్రామాల్లో లాక్ డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రహదారి సౌకర్యం, తాగునీటి వసతిని కల్పించారు. కాళ్లు లేకుండా బాధపడుతున్నవారికి కృత్రిమ కాళ్లు అందజేశారు. కృత్రిమ కాలును అమర్చడంతో బాధితులు మెల్లమెల్లగా నడుస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ట్రాక్టర్ ప్రమాదం..
గుండాలకి చెందిన కోవ లక్ష్మి 2017లో ట్రాక్టర్ ప్రమాదంలో కాలు కోల్పోయింది. మూడేళ్ల నుంచి మంచానికే పరిమితమైంది. ఈ తరుణంలో కృత్రిమ కాలును అమర్చడం వల్ల కొద్దిదూరం ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవగలుగుతుంది. తమ పని తాను చేసుకుంటూ ఇంట్లో పనుల్లో కొంతవరకు సాయం చేస్తోంది. మూడేళ్ల నుంచి ఇప్పటివరకు వికలాంగుల పింఛన్ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
నాటు వైద్యంతో...
గంగాపూర్ గ్రామానికి చెందిన మడావి నీలును 2019లో చేనులో పనిచేస్తుండగా పాము కాటేసింది. ఆస్పత్రికి వెళ్ళకుండా నాటు వైద్యం చేయించారు. ఫలితంగా ఆమె కాలు కుళ్లిపోయింది. ఈ విషయం ఎస్సై రామారావు దృష్టికి వెళ్ళింది. ఎస్సై రామారావు చొరవతో గోదావరిఖని పట్టణానికి చెందిన ఆలయ ఫౌండేషన్ సహకారంతో కృత్రిమ కాలును అమర్చారు. ప్రస్తుతం నీలు నడవడంతో పాటు, తన పనులు తాను చేసుకుంటోంది. ఇప్పటివరకు వికలాంగుల పింఛన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి పింఛన్ ఇవ్వాలని కోరుతోంది.