తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసిఫాబాద్​లో నకిలీ అధికారుల హల్​చల్​ - ఆసిఫాబాద్​లో నకిలీ అదికారులు

సినీఫక్కీలో  స్టైల్​గా కారులో వచ్చారు. అచ్చం ప్రభుత్వాధికారుల్లాగే మాట్లాడారు. మార్కెట్లోని దుకాణాదారులను హడలగొట్టారు. రూల్స్​ మాట్లాడారు. జరిమానా విధిస్తాం.. కేసు నమోదు చేస్తాం.. అంటూ వ్యాపారులకు చెమట పట్టించారు. భయపడ్డ వ్యాపారుల దగ్గర డబ్బులు వసూలు చేశారు. తీరా.. ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కి.. కటకటాలు లెక్క పెడుతున్నారు.

Police Caught Fake Officers In Aasifabad
ఆసిఫాబాద్​లో నకిలీ అధికారుల హల్​చల్​

By

Published : May 29, 2020, 2:14 PM IST

కన్జూమర్​ ఫోరం నుంచి వచ్చామంటూ ఆసిఫాబాద్​ నియోజక వర్గంలోని నార్నూర్​ మార్కెట్లో నకిలీ అధికారులు హల్​చల్​ సృష్టించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్​ నియోజకవర్గ పరిధిలోని నార్నూర్​ మండల కేంద్రంలో గల మార్కెట్​కి ఓ ముఠా వచ్చింది. వచ్చీ రాగానే.. అందులోని కొందరు సభ్యులు అక్కడి దుకాణాల్లో ప్రవేశించి.. మాస్కులు లేవంటూ.. నిబంధనలు పాటించడం లేదంటూ.. రూల్స్ మాట్లాడారు. చూడడానికి ఆఫీసర్లలాగే ఉన్నారు. వారిని చూసి కంగారు పడ్డ కొందరు వ్యాపారులు వారు కోరినంత డబ్బులు సమర్పించుకున్నారు. వారి వాలకంలో తేడా గమనించిన ఓ వ్యాపారి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసుల చేతికి చిక్కారు.

టీఎస్ 01 ఈఎం 3291 ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనే బోర్డు ఉన్న వాహనంలో ఐదుగురు వ్యక్తులు ఎన్జీవో, కన్జ్యూమర్​ ఫోరం అధికారులమని చెబుతూ నార్నూర్ మార్కెట్​కు వచ్చారు. వారిలో ఉట్నూర్ మండలం బార్సాయి పేట గ్రామానికి చెందిన ముదుగు అమృతరావు, ముదుగు అఖిల్, లింగంపల్లి లక్ష్మణ్, ఆదిలాబాద్ బుక్తపూర్​కు చెందిన సుధగొర్లె విజయ్, ఉట్నూర్ మండలం శ్యాంపూర్ కు చెందిన డోలి విజయ్ కుమార్ ఉన్నారు. నేరుగా మార్కెట్లోని విత్తనాలు, ఎరువుల దుకాణంలోకి వెళ్లారు. యజమాని శివ వద్దకు వెళ్లి మేము కన్జ్యూమర్​ ఫోరం అధికారులం.. మీ లైసెన్సు, అనుమతి దస్త్రాలు అన్ని చూపెట్టండి.. మాస్కులు ఎందుకు ధరించలేదు? మీకు 25 వేల రూపాయల జరిమానా వేస్తాం అంటూ బెదిరించారు. జరిమానా కట్టకుంటే.. కేసు నమోదు చేస్తామని.. అప్పుడు నిజామాబాద్ కోర్టుకు రావాల్సి ఉంటుందని బెదిరించారు. భయపడ్డ శివ అన్ని డబ్బులు ఇచ్చుకోలేనని.. రూ 2500 ఇచ్చి రశీదు అడిగాడు. వేరే దుకాణానికి వెళ్లి వచ్చి రశీదు ఇస్తామని అక్కడి నుంచి మరో దుకాణంలోకి వెళ్లారు. విజయ్ కుమార్ అనే వ్యాపారి దగ్గర వెయ్యి రూపాయలు వసూలు చేశారు. ఆ తర్వాత గాంధీ చౌక్​లోని బేకరీ యజమాని గోవిందును బెదిరించారు. వీరి ప్రవర్తన పట్ల అనుమానం వచ్చిన గోవిందు నేరుగా ఎస్సై విజయ్ కుమార్​కు సమాచారం అందించాడు.

ఈ విషయాన్ని గ్రహించిన అమృతరావు ముఠా తమ వెంట తెచ్చుకున్న వాహనంలో పరారయ్యారు. అప్రమత్తమైన పోలీసులు గాదిగూడ, ఉట్నూర్, కొత్తపల్లి ప్రాంతాలకు వెళ్లి గాలించారు. పూసిగూడ ఘాట్ వద్ద నకిలీ అధికారుల ముఠాను పట్టుకున్నారు. వ్యాపారులు శివ, విజయ్ కుమార్​ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. లాక్​డౌన్ తర్వాత కోర్టులో హాజరు పరచి నిందితులను రిమాండ్​కు పంపుతామని ఎస్సై విజయ్​ కుమార్​ తెలిపారు.

ఇదీ చదవండి:కరోనా వ్యాక్సిన్​ కోసం మళ్లీ ప్లాస్మా దానం

ABOUT THE AUTHOR

...view details