కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల తహసీల్దారు కార్యాలయం వద్ద పలువురు ఆందోళన చేశారు. తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన తహసీల్దారు ఇప్పుడు బదిలీపై వెళ్లిపోతున్నారని ఆరోపించారు.
తమవద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు.