తెలంగాణ

telangana

ETV Bharat / state

మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు... కొనసాగుతోన్న పోలీసుల కూంబింగ్ - Police Cumbing in asifabad forest area

సుదీర్ఘకాలం తర్వాత వరుస ఘటనలతో రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అలజడి ఏర్పడింది. సరిహద్దు జిల్లాల్లో చాలాకాలం తర్వాత మరోసారి మావోయిస్టుల కదలికలు పెరగగా... మావోయిస్టుల ప్రయత్నాల్ని ఆదిలోనే తిప్పికొట్టేందుకు పోలీసు బలగాలు అడవుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. స్వయంగా డీజీపీ రంగంలోకి దిగి క్షేత్రస్థాయి శ్రేణుల్ని సమాయత్తం చేయడం వంటి అంశాలు.... సరిహద్దుల్లో పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి.

మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు... కొనసాగుతోన్న పోలీసుల కూంబింగ్
మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు... కొనసాగుతోన్న పోలీసుల కూంబింగ్

By

Published : Sep 21, 2020, 4:55 AM IST

మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు...

ఆసిఫాబాద్‌ అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్‌ కొనసాగుతోంది. తరచూ జరుగుతున్న సంఘటనలతో కలకలం రేగుతోంది. డీజీపీ నేరుగా జిల్లాలోని పోలీసు అధికారులతో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వరుస ఘటనలతో పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను జరుపుకోవాలంటూ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి జగన్ పిలుపు ఇవ్వగా.. ఉత్కంఠ నెలకొంది.

మూడునెలల వరకు ప్రశాంతం...

తెలంగాణలో మూడు నెలల క్రితం వరకు పరిస్థితి ప్రశాంతంగానే కనిపించింది. వర్షాకాలం మొదలైన తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో వాతావరణం మారిపోయింది. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి బస్వరాజ్ ఆదేశాలతో తెలంగాణలో పట్టు సాధించేందుకు రాష్ట్రకమిటీ సభ్యులు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్... ఆసిఫాబాద్ అడవుల్లో, కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ భద్రాద్రి కొత్తగూడెం అడవుల్లో, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ భూపాలపల్లి, ములుగు అడవుల్లో సంచరిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది.

ఎదురుకాల్పుల ఘటన...

ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రోళ్లపాడు గుట్టపై ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకొంది. తర్వాత మణుగూరు మండలం మల్లెతోగు అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్‌ గాయపడ్డాడు. ఈనెల 3న గుండాల మండలం దేవళ్లగూడెం అటవీ ప్రాంతంలో ఒక మావోయిస్టు, 7న చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. వీటి నేపథ్యంలో బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు... చర్ల మండలం పెదమిడి సీలేరు, తాలిపేరు మార్గంలో ఐఈడీ పేల్చారు. అంతకుముందు అదే మండలం తేగడ, కలివేరు ప్రధాన రహదారిలో మందుపాతర్లను పోలీసులు నిర్వీర్యం చేశారు.

విస్తృత సంచారం...

ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అడవుల్లో భాస్కర్ దళం విస్తృతంగా సంచరిస్తూ... పోలీసులకు సవాల్ విసురుతుండటం... ఏడుసార్లు ఎన్‌కౌంటర్ల నుంచి భాస్కర్ తృటిలో తప్పించుకోవడం... ఈసందర్భంగా దొరికిన డైరీల్లో రిక్రూట్‌మెంట్లకు పాల్పడుతున్న సమాచారం లభించగా.. డీజీపీ మహేందర్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో రాజకీయ నేతల సిఫారసులతో సంబంధం లేకుండా పోలీస్ పోస్టింగులిచ్చారు. ఆయనే స్వయంగా ఆసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో సంచరించి క్షేత్రస్థాయి పోలీసులకు దిశానిర్దేశం చేశారు.

మరోమారు...

ఆ తర్వాత సైతం భాస్కర్ దళం కదలికలు సద్దుమణగకపోవడం వల్ల నెలన్నర వ్యవధిలోనే మరోమారు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల్లో డీజీపీ పర్యటించారు. ఏకంగా ఐదు రోజులపాటు అక్కడే మకాం వేసి కొత్తగా విధుల్లో చేరిన ఎస్‌ఐలు, సీఐలతో నేరుగా మాట్లాడి ఉత్సాహం నింపారు. ఇదేక్రమంలో అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు.

కూంబింగ్...

రూ. 25 లక్షల రివార్డు ఉన్న భాస్కర్ తోపాటు వర్గీస్ కోసం పదుల సంఖ్యలో బలగాలు కూంబింగ్ కొనసాగుతుండటం వల్ల మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో ఉనికి చాటుకునే చర్యలు జరిగే అవకాశముండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చూడండి: కొత్త రెవెన్యూ చట్టంపై రైతు సంఘాల రౌండ్​ టేబుల్​ సమావేశం

ABOUT THE AUTHOR

...view details