తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదివాసీ హక్కుల కోసం ప్రాణాలర్పించిన యోధుడు కుమురం భీం - kumurambheem latest news

అదో ఘీంకార స్వరం... సాయుధ నిజాం బలగాలకు వ్యతిరేకంగా పాంచజన్యంలా వినిపించిన విప్లవశంఖం. ఆదివాసీల స్వయం ప్రతిపత్తే ధ్యేయంగా ఎగిసిన ఉద్యమ బావుట. దేశానికి స్వాతంత్య్రం రాకముందే జల్​-జంగల్​-జమీన్‌ నినాదంతో రణక్షేత్రంలో ఎగిసిన ఆ పతాకమే... కుమురం భీం. ఎనిమిది దశాబ్ధాల కిందట మూగబోయిన ఆ స్వరం... ఇప్పటికీ పోరాటాల రూపంలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. కుమురంభీం 80వర్థంతిపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

kumurambheem death aniversary
ఆదివాసీ హక్కుల కోసం ప్రాణాలర్పించిన యోధుడు కుమురం భీం

By

Published : Oct 31, 2020, 6:26 AM IST

కుమురం భీం ప్రధాన నినాదం.. జల్​-జంగల్‌-జమీన్‌. అంటే నీరు, అడవి, భూమితో పాటు ఆదివాసీ ప్రజల హక్కుల కోసం ఉద్యమించిన ఉద్యమకారుడు కుమురంభీం. జోడేఘాట్‌ కేంద్రంగా 12 ఆదివాసీ గ్రామాలకు స్వయం ప్రతిపత్తి కోసం తిరుగుబాటు చేసిన యోధుడు. అప్పట్లో ఆసిఫాబాద్‌ ప్రాంతమంతా దట్టమైన అడవులు.., ఎత్తైన కొండలతో...శతృదుర్భేద్యంగా ఉండడం.. భీం సల్పిన పోరాటానికి అన్నివిధాలుగా కలిసి వచ్చింది.

పలు ఉద్యమాలకు ప్రేరణ

ఆసిఫాబాద్‌ జిల్లాలోని సంకెపల్లిలో 1890 సెప్టెంబర్‌ 27న జన్మించిన భీం చిన్నప్పుడే తల్లీతండ్రులను కోల్పోయి.. ఆయన బాబాయి దగ్గర పెరిగాడు. పండించిన పంట కోసం బాబాయిపై జులుం ప్రదర్శించిన సిద్ధిఖీ అనే అధికారిపై భీం దాడిచేశాడు. ఆ దాడిలో సిద్ధిఖీ చనిపోవడం వల్ల భీం అసోం వెళ్లిపోయి... అక్కడి కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూనే... ఉద్యమాల వీరుడిగా ఎదిగాడు. తరువాత జోడేఘాట్​కు తిరిగివచ్చి.. జల్​-జంగల్​-జమీన్‌ నినాదం పేరిట నిజాం ప్రభువుపై తిరుబాటు చేశాడు. ఉద్యమం ఉద్ధృతమవుతున్న సమయంలోనే జోడేఘాట్‌ గుహల్లో నిద్రిస్తున్న ఆయన స్థావరంపై 1940 అశ్వయుజ పౌర్ణమి రోజున నిజాం సైన్యం జరిపిన కాల్పుల్లో భీం అసువులు బాశాడు. అప్పటి నుంచి ప్రతి ఏడాది అశ్వయుజ పౌర్ణమి రోజున భీం వర్థంతి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన సల్పిన ఆచరణాత్మకమైన పోరాటం... 1981లో జరిగిన ఇంద్రవెల్లి ఘటనకు, ఆ తరువాత మలిదశ తెలంగాణ ఉద్యమానికి, ఇప్పుడు ఆదివాసీల హక్కుల సాధన ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తోంది.

జోడేఘాట్​పై ప్రత్యేకదృష్టి

తెలంగాణ రాష్ట్రసాధన అనంతరం ప్రభుత్వం జోడేఘాట్​పై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా 2015లో జోడేఘాట్‌కు వచ్చిన కేసీఆర్‌ అక్కడి పరిస్థితులను చూసి చలించి పోయారు. వంద ఎకరాల విస్తీర్ణంతో ప్రపంచమే అబ్బురపడేలా జోడేఘాట్‌ను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని భరోసా కల్పించడం ఆదివాసీల్లో ఆశలను రేకెత్తించింది. కానీ కేవలం భీం మ్యూజియం నిర్మాణం తప్పా... ఇప్పటికీ అక్కడి ఆదివాసీ బతుకుల్లో ఎలాంటి ప్రగతి కనిపించడంలేదు. ఏడాదికోసారి నిర్వహించే భీం వర్థంతి రోజు మినహా మిగిలిన రోజుల్లో జోడేఘాట్​కు... కనీసం ఆర్టీసీ బస్సు రాకపోకలకు నోచుకోవడంలేదు. భీం పోరాటం గూర్చి గొప్పలుగా చెప్పే ప్రభుత్వం... ఆ హక్కుల కోసమే తాము నినధిస్తుంటే నక్సలైట్లుగా ముద్రవేస్తున్నారనే ఆవేదన ఆదివాసీల్లో వినిపిస్తుంటే.. భీం త్యాగనిరతి గిరిజనేతరుల్లోనూ స్పూర్తినింపుతోంది.

రాష్ట్రవ్యాప్యంగా ఆదివాసీలు నిర్వహిస్తున్న ఉద్యమాలకు ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లానే వేదికగా నిలవడానికి భీం పోరాటమే ప్రధాన కారణం.

ఇవీ చూడండి: కిసాన్‌ అధికార్‌ దివాస్​ను విజయవంతం చేయండి: ఉత్తమ్​కుమార్​

ABOUT THE AUTHOR

...view details